Avanti-Srinivas on Pawan Kalyanబంతి.., చామంతి.. పూబంతి అంటూ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ అవంతిపై వేసిన పంచ్ డైలాగ్స్ కు వైసీపీ నేతలు కౌంటర్లు సిద్ధం చేస్తున్నారు. కౌంటర్లకు వేళయరా… అన్నట్లు ఒక్కొక్కరుగా పవన్ పై తమ తమ ప్రతిదాడిని మొదలుపెట్టారు. ఈ సందర్భంలో భాగంగా వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన పదునైన విమర్శలతో పవన్ ని కట్టడిచేయాలనుకొని, చివరికి తన బంతితో తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారనేది జనసేన కార్యకర్తల మాటలు.

ఇంతకీ విషయానికి వస్తే…. ప్రస్తుత ప్రభుత్వం మీద పవన్ చేసిన విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా గతంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ ఎప్పుడైనా చంద్రబాబుని ప్రశ్నించారా? పవన్ కు అప్పటి టీడీపీ ప్రభుత్వం అవినీతి కనపడలేదా? తెలుగుదేశం హయాంలో మీకు గూండాగిరి కనిపించలేదా? అసలు టీడీపీతో 2014లో పొత్తులెందుకు పెట్టుకున్నారు? 2017లో పొత్తులెందుకూ విడగొట్టారు? అంటూ పవన్ తో పాటు గత టీడీపీ పాలనపై విమర్శలు చేసారు అవంతి. ఇదే టిడిపి-జనసేన వర్గీయులకు ఆయుధంగా మారింది.

అవంతి గజనిలా మారిపోయి గత టీడీపీ పాలన అంటూ గతం తవ్వే ప్రయత్నం చేస్తూ… ఆ గతంలో వారు కూడా ఉన్నారనే విషయం మంత్రి గారు మరిచినారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు టీడీపీ – జనసేన సోషల్ మీడియా వింగ్. పరిస్థితి చూస్తుంటే వైసీపీ పార్టీ పేద్దలే “టీడీపీ – జనసేన” పార్టీలను ఒకే తాటి పైకి తీసుకువచ్చేలా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం ఊపందుకుంది.

2014 ఎన్నికల్లో అమలాపురం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు అవంతి. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ పై ఒక్క రోజు నిరాహారదీక్ష అంటూ నిరసన తెలిపి కొద్దో గొప్పో కేంద్రంపై తన గళాన్ని వినిపించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ ఇదే మాదిరి జనసేన ఆవిర్భావ సభ అంటూ మంగళగిరిలో పెద్ద ఎత్తున నిర్వహించి అప్పటి ప్రభుత్వంపై., వారి నాయకులపై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

కాకపోతే అవంతి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే… అప్పుడు కూడా పవన్ కు కౌంటర్ విమర్శలను సంధించారు ఈ అవంతి అని గతాన్ని తట్టిలేపే పనిలో ఉన్నారు జనసైనికులు. 2019 ఎన్నికలకు కొద్దీ నెలల ముందే అవంతి టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు. కానీ ఈ విషయాన్ని మరచి అవంతి గత ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతుంటే తనపై తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుందని టీడీపీ నాయకులు కూడా చురకలు అంటిస్తున్నారు.

“గోడ మీద పిల్లి” చందంగా వ్యవహరించే ఇటువంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు., ఇటువంటి రాజకీయ నాయకులను ప్రోత్సహిస్తున్న పార్టీ అధినాయకులు ఉన్నంత వరకు.., ఇటువంటి నేతలను ఎన్నుకుంటున్న ప్రజలు ఉన్నంత వరకు… ఈ రాజకీయ వ్యవస్థలో “భయం., బాధ్యత., పారదర్శకత., జవాబుదారీతనం” వంటి పదాలకు స్థానం ఉండదనేది రాజకీయ విశ్లేషకుల ప్రగాఢ విశ్వాసం.