ysr congress party going for early electionsరాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో అర్ధం కాని రీతిలో ఉంటున్నాయి. 2014 ఎన్నికలలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని భావించగా, రాష్ట్ర విభజనతో చివరి ఆరు నెలల్లో పరిస్థితులు మొత్తం టీడీపీకి అనుకూలంగా మారిపోయి, చంద్రబాబు పగ్గాలు చేపట్టారు. అలాగే 2019 ఎన్నికలలో టీడీపీ విజయబావుట ఎగురవేస్తుందని అంచనాలు వేయగా, జగన్ పాదయాత్ర మొత్తాన్ని మలుపు తిప్పి వైసీపీని అధికారంలో కూర్చోపెట్టింది.

అయిదేళ్లు పాటు అందించాల్సిన పాలన ఉండగా, ఇటీవల చంద్రబాబు చేసిన ముందస్తు ఎన్నికల ట్రాప్ లో వైసీపీ చిక్కుకున్నట్లుగా కనపడుతోంది. వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతోందంటూ టీడీపీ అధినేత చేసిన కీలక వ్యాఖ్యలకు స్వయంగా సజ్జల బదులిచ్చారంటే, ముందస్తు మాటకు ‘వైసీపీ అండ్ కో’ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్ధం చేసుకోవచ్చు.

‘ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదంటూ’ సజ్జల స్పష్ట ఇచ్చే ప్రయత్నం చేస్తూ, ఇది ప్రధాన ప్రతిపక్ష ఆరోపణగా కొట్టిపడేసారు. అయితే ముందస్తు ఎన్నికలకు వెళితే “ముందు నుయ్యి వెనుక గొయ్యి” మాదిరి వైసీపీ పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళితే చంద్రబాబు చేసిన ఆరోపణలను నిజం చేసినట్లవుతుందని, అప్పుడు జగన్ పై చంద్రబాబు పైచేయి సాధించినట్లవుతుందని అంటున్నారు.

ఒకవేళ ముందస్తుకు వెళ్లకుండా అయిదేళ్ల పాటు పాలన అనుభవించాలని భావిస్తే, అప్పుడు కూడా టీడీపీ నుండి విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎన్నికలకు వెళితే వైసీపీ అధికారంలోకి వస్తుందో లేదో అన్న అనుమానంతోనే, చేతిలో ఉన్న అధికారాన్ని చేతులారా వదులుకోవడం ఇష్టం లేకనే ముందస్తు ఆలోచనలు చేయడం లేదన్న ఎదురుదాడి టీడీపీ నుండి వ్యక్తం కావచ్చన్నది పొలిటికల్ టాక్.

151 సీట్లతో అత్యంత బలంగా ఉన్న వైసీపీకి ప్రస్తుతం 23 సీట్లు దక్కించుకున్న టీడీపీ బలంగా కనిపిస్తున్నట్లుంది. ఎందుకంటే మొదటి రెండేళ్ల పాటు వైసీపీ అనుసరించిన విధానానికి, గత ఆరు మాసాలుగా జగన్ నేతృత్వంలో జరుగుతోన్న పాలనకు పూర్తి వ్యత్యాసం ఉంది. టీడీపీ బలం పుంజుకుందని చెప్పడానికి, వైసీపీ బలహీనపడుతోందని చెప్పడానికి ఇదొక్క నిదర్శనం చాలన్నది తెలుగు తమ్ముళ్ల మాటలు.