YSR_Congress_Partyవచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల వారీగా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే కీలకమైన ఈ సమావేశాలలోనే పార్టీలో లుకలుకలు బయటపడుతుండటం విశేషం.

విశాఖ సౌత్‌ నియోజకవర్గంలో టిడిపి నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్‌కి, వైసీపీలో ఎప్పటి నుంచో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ వర్గాల మద్య విభేధాలు ప్లీనరీ సమావేశంలో బయటపడ్డాయి.

ఈ సమావేశానికి సుధాకర్ వర్గానికి చెందిన 8 మంది కార్పొరేటర్లు మొహం చాటేయగా మరో ఇద్దరు మాత్రమే హాజరవడంతో వాసుపల్లి గణేశ్ కుమార్‌ షాక్ అయ్యారు. వైసీపీలో చేరినప్పటి నుంచి పార్టీ నేతలు తనతో ఇదేవిదంగా వ్యవహరిస్తూ పదేపదే అవమానిస్తున్నారని వాసుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ప్లీనరీ నిర్వహిస్తే కొందరు కార్పొరేటర్లు హాజరుకాకపోవడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నానని అన్నారు. సుధాకర్ వర్గంపై సిఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని వాసుపల్లి గణేశ్ కుమార్‌ అన్నారు.

సుధాకర్ మద్దతుదారులు బీచ్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, తమను సంప్రదించకుండా, ముందుగా సమాచారం ఇవ్వకుండా వాసుపల్లి ఏకపక్షంగా ప్లీనరీ సమావేశం నిర్వహించినందునే వెళ్ళలేదని చెప్పారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు వాసుపల్లిని భరిస్తున్నామని కానీ అయన ఒంటెత్తు పోకడలు పోతున్నారని సుధాకర్ మద్దతుదారులు అన్నారు.

అయితే వాసుపల్లి, సుధాకర్ మద్య ఈ విభేధాలకి కారణం టికెట్ పంచాయితీయే. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన వాసుపల్లికే మళ్ళీ టికెట్ వస్తుందని ఆయన మద్దతుదారులు వాదిస్తుంటే, పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న సీతంరాజు సుధాకర్‌కే ఈసారి టికెట్ వస్తుందని ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు. దీని కోసం రెండు వర్గాలు ఇటు పార్టీలోను, బయట నియోజకవర్గంలోను ఎవరి ప్రయత్నాలు వారు చేసుకొంటున్నారు.