Sucharitha YSR Congress Partఒక మాట మీద నిలబడడం, చెప్పిన మాటకు కట్టుబడి ఉండడం వైసీపీ డిక్షనరీలో లేదన్నట్లుగా నేతలు మాటలు మారుస్తూ వస్తున్నారు. ‘యధా రాజా తధా ప్రజా’ అన్న రీతిలో పార్టీ అధినాయకుడు జగన్ మోహన్ రెడ్డి నుండి నేతల వరకు అదే తంతు! ఇదే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వర్గీయులకు అవకాశాలను సృష్టిస్తోంది.

ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుండి అనేక విషయాలలో మాటలు మార్చిన జగన్ మోహన్ రెడ్డిని తూర్పారబడుతూ నెట్టింట అనేక వీడియోలు ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు, టీడీపీ పార్టీ నేతలు ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, ప్రజలలో చైతన్యం నింపే ప్రయత్నం చాలా బలంగా జరుగుతోంది.

బహుశా టీడీపీ ఇక పుంజుకోదు, ప్రజలు తాము ఏది చెప్తే అదే గుడ్డిగా నమ్మేస్తారు, రాజకీయంగా తమకు తిరుగులేదని, ఇక ఎదురు ఎవ్వరూ లేరని అని భావిస్తున్నారో ఏమో గానీ, అలాంటి అవకాశాలను ప్రతి రోజూ ఏదొక నేత కల్పిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ బాధ్యతను మాజీ హోమ్ శాఖా మంత్రివర్యులు మేకతోటి సుచరిత అందిపుచ్చుకున్నారు.

నేను ముఖ్యమంత్రికి ‘థాంక్స్ గివింగ్ నోట్’ పంపిస్తే, దానిని రాజీనామా లేఖగా చిత్రీకరించి ప్రత్యర్ధులు ప్రచారం చేసారని సుచరిత చెప్పుకొచ్చారు. అయితే ఆ ప్రత్యర్థి ఎవరో కాదు, ఆమె తనయురాలేనని చెప్తూ, మంత్రులకు పదవులు వరించిన సమయంలో ఆమె కూతురు పలికిన పలుకుల వీడియోను సోషల్ మీడియా ముంగిట్లో ఉంచారు టీడీపీ వర్గీయులు.

అమ్మకు ఆరోగ్యం సరిగా లేదని, అందుకే ఆమె మీడియా ముందుకు రాలేకపోతున్నారని, పార్టీకి రాజీనామా చేయలేదు గానీ, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసారని, స్పీకర్ ఫార్మాట్ లోనే మోపిదేవి వెంకట రమణ గారికిచ్చారని స్వయంగా మేకతోటి సుచరిత తనయురాలు మీడియా ముందర వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

తాజాగా సుచరిత వచ్చి ఏమో ఇదంతా ప్రత్యర్థుల ప్రచారంగా కొట్టిపడేసారు. అంటే సొంత కూతురు ప్రత్యర్థి అని భావించాలా? లేక ఇంకా ప్రజలను పిచ్చోళ్లను చేయాలని అనుకుంటూనే ఉన్నారా? ఏది ఏమైనా… అందివచ్చిన అవకాశాలను చేత పట్టుకుంటున్న టీడీపీ సోషల్ మీడియా వింగ్, నాటి సుచరిత తనయురాలి వ్యాఖ్యలు – నేటి సుచరిత వ్యాఖ్యలతో వీడియో రూపొందించి వైరల్ చేస్తున్నారు.