Raghu-Rama-Krishnam-Raju on YSRCP Governmentతమకు లభించాల్సిన పీఆర్సీ తమకు దక్కలేదు కాబట్టి ఏపీ ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసును అందించాయి. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి దిగబోతున్నట్లుగా స్పష్టం చేసాయి. ఉద్యోగ సంఘాల కార్యాచరణకు ఇతర రాజకీయ నేతల నుండి కూడా మద్దతు లభిస్తోంది.

ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం తమ మద్దతు ప్రకటించగా, తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా ఉద్యోగులకు బాసటగా ప్రకటనలు చేసారు. అంతేకాదు ప్రభుత్వం మీద ఏ విధంగా పోరాడాలో కూడా నేటి రచ్చబండలో భాగంగా వెల్లడించారు ఆర్ఆర్ఆర్.

ప్రభుత్వం ఇప్పటివరకు వివిధ రకాలుగా పెట్టిన వృధా ఖర్చును ఈ సందర్భంగా ప్రస్తావించారు. మా పార్టీకి ఉన్నంత రంగుల పిచ్చి ఏ ఇతర పార్టీలకు ఉండదని, ఇందుకోసం కొన్ని వేల కోట్లను వృధాగా ఖర్చు పెట్టామని, చివరికి కోర్టులు కల్పించుకుని గడ్డి పెట్టినా మా వాళ్ళు తగ్గలేదని, కనిపించిన ప్రతి దానికి పార్టీ రంగులేసేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని దుయ్యబట్టారు.

పక్కనే ఉన్న 20, 30 కిలోమీటర్ల ప్రయాణానికి కూడా స్పెషల్ హెలికాఫ్టర్ ను వినియోగించడం మా సీఎంకు పరిపాటి అని, ఓ పక్కన డబ్బులు లేవని చెప్తూనే ఉంటారు, మరో పక్కన ఇలా డబ్బులను వృధా చేస్తూనే ఉంటారని ఆరోపించారు. ఇక సాక్షికి పబ్లిసిటీ రూపంలో కట్టపెడుతున్న కోట్లకు కొదవ లేదని, ఏ పిచ్చి పని చేసినా సాక్షిలో మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతో ఏదో అద్భుతం సృష్టించినట్లుగా రాసుకోవడం, మాకు మేమే చప్పట్లు కొట్టుకోవడం కామన్ అని చెప్పుకొచ్చారు.

ఇక అవసరం లేని ఒక వాలెంటైర్ వ్యవస్థను తీసుకువచ్చి కొన్ని కోట్ల ప్రజాధనాన్ని జగన్ దుర్వినియోగం చేసారని ఆర్ఆర్ఆర్ ఆరోపించారు. చక్కగా ఒక బటన్ నొక్కితే అయిపోయే పనికి, కొన్ని లక్షల మందిని నియమించి, వారిని వైసీపీ కార్యకర్తలుగా మారుస్తూ డబ్బంతా వేస్ట్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇలా ఏపీలో సొమ్మంతా తీరు తెన్నూ లేకుండా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.

అత్యంత ముఖ్యమైన అంశం మరొకటి ఏమిటంటే, సాక్షిలో ఉండే ఒక సామాజిక వర్గపు ఉద్యోగులందరినీ తీసుకువచ్చి సలహాదారుల పేరులతో ప్రతి నెలా లక్షల రూపాయలు వారికి దారబోస్తున్నారని అన్నారు. అసలు ఒక రాష్ట్రానికి ఇంతమంది సలహాదారులు ఎందుకని, ఇంతమంది సలహాదారులు ఉంటే అసలు ముఖ్యమంత్రి ఏం చేస్తారని ప్రశ్నించారు.

వీళ్ళెవరూ కూడా కనీసం 10వ తరగతి కూడా పాస్ కాలేదని, టెన్త్ క్లాస్ పాస్ కాకపోతే ఎమ్మెల్యే అవ్వొచ్చు, ఆఖరికి సీఎం కూడా అవ్వొచ్చు గానీ సలహాదారుడు కాలేడని, కానీ మా జగన్ తలచుకుంటే వాళ్లే సలహాదారులు అవుతారని, దానికి అతి పెద్ద క్వాలిఫికేషన్ పేరు చివరన ఉండే ‘రెండు’ అక్షరాలని ఆర్ఆర్ఆర్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

ఇలా గత రెండున్నర్రేళ్ళుగా జగన్ చేస్తోన్న వృధా ఖర్చును ఉదహరిస్తూ తమకు న్యాయంగా రావాల్సిన పీఆర్సీపై ఉద్యోగులు పోరాడాలని పిలుపునిచ్చారు రఘురామకృష్ణంరాజు. దీనికి తన వంతు మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు. చూడబోతుంటే ఉద్యోగ సంఘాల సమ్మె పోరాటానికి కావాల్సిన కంటెంట్ ను ఆర్ఆర్ఆర్ సిద్ధం చేసినట్లుగా కనపడుతోంది.