అబద్ధాలు చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించిపోయారని, తన తండ్రి 21 మార్లు విదేశీ పర్యటనలు చేసి, 21 ఉద్యోగాలను కూడా సృష్టించని వేళ, లోకేష్ రెండేళ్లలో ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తానని అంటున్నారని, అలాంటి ఆయనను ఏమనాలో కూడా తనకు అర్థం కావడం లేదని, ఈ మంత్రి గారి గురించి చెప్పాలంటే… ‘జబర్దస్త్’ షో కూడా సరిపోదంటూ నారా లోకేష్ పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో రోజాకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటు కౌంటర్ ఇచ్చారు. జగన్ దర్శకత్వంలో రోజా ‘జబర్దస్త్-2’ చేస్తున్నారని… జగన్, రోజాలు 420 లని, ఇటువంటి వాళ్లా చంద్రబాబును, లోకేష్ ను విమర్శించేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన నాటి నేతలు కొండా సురేఖ, సబ్బం హరి, కొణతాల రామకృష్ణ కు ఏ గతి పట్టిందో, చివరకు రోజాకు అదే గతి పట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.
అలాగే వైసీపీ అధినేత జగన్ ది ఒక సైకో మెంటాలిటీ అని, ఆంధప్రదేశ్ ప్రభుత్వంపై అనవసర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, జగన్ కు దమ్ముంటే పులివెందుల సీటు ఖాళీ చేయాలని, తమ యువనేత నారా లోకేష్ ఆ స్థానంలో పోటీ చేసి గెలుస్తారని ఈ సందర్భంగా సవాల్ విసిరారు బుద్దా వెంకన్న. ‘జబర్దస్త్’ షో చేయడం కోసమే రోజాను జగన్ విజయవాడకు పంపుతున్నారని చురకలంటించారు.