YSR Congress Ministers Vishakha Garjana three capitalsఏపీలో అమరావతి-మూడు రాజధానుల పేరుతో జరుగుతున్న పాదయాత్రలు, ర్యాలీలు, ఆందోళనలు చూసి ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రజలు నవ్వుకొంటుంటే, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వారి ముందు అవమానంతో తలదించుకోవలసివస్తోంది. వీటితో ప్రజల మద్య ప్రాంతాల చిచ్చురగులుతోందని ప్రభుత్వం గ్రహించినా ఇటువంటి ర్యాలీలు నిర్వహిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపీలో ఇవే పరిస్థితులు ఇంకా కొనసాగితే ప్రజల మద్య ఈ ద్వేష భావాలు, ప్రాంతీయ విభేదాలు పెరిగిపోయి ఏదో ఓ రోజున ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మళ్ళీ మరో మూడు ముక్కలైనా ఆశ్చర్యం లేదు.

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొన్ని రోజుల క్రితం వైఎస్ షర్మిల తనపై చేసినప్పుడు వైఎస్ కుటుంబంలో విభేదాల గురించి ప్రస్తావిస్తూ “మూడు రాజధానులు కాదు… మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసుకొని ముగ్గురినీ పాలించుకోమనండి,” అని అనేశారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రజలు మన రాష్ట్రం గురించి ఏమనుకొంటున్నారో అర్దం చేసుకోవడానికి ఇది ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.

పొరుగున హైదరాబాద్‌ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతూ, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకొంటోంది. భారీగా పెట్టుబడులు, ఐ‌టి కంపెనీలు, జాతీయ అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు తరలివస్తున్నాయి. తరచూ హైదరాబాద్‌కు రాకపోకలు చేసే మన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ 8 ఏళ్ళలో హైదరాబాద్‌ ఎంతగా అభివృద్ధి చెందిందో, ఎన్ని కోట్ల పెట్టుబడులు వస్తున్నాయో కళ్ళారా చూస్తూనే ఉన్నారు. అయినా మనకూ అటువంటి గొప్ప రాజధాని కావాలని వారికి ఏనాడూ అనిపించలేదా? రాజధాని లేకపోవడం అవమానంగా అనిపించడం లేదా?

తామందరం రాష్ట్రం కోసం ఎంతగానో పరితపించిపోతున్నామన్నట్లు విశాఖ గర్జనలో మొసలి కన్నీళ్ళు కార్చిన వైసీపీ నేతలు ఏనాడైనా ధైర్యం చేసి తమ అధినేతతో ఈ విషయాలు చర్చించారా? అసలు వారికి అంత ధైర్యమే వారికి ఉండి ఉంటే నేడు ఏపీకి ఈ దుస్థితి వచ్చేది కాదు… ఇరుగుపొరుగులు మనల్ని చూసి నవ్వుకొనేవారు కాదు కదా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి. కానీ నేటికీ రాజధాని ఎక్కడో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా చెప్పలేకపోతున్నారు. ఇక ప్రజలేమి చెప్పగలరు? ఒకవేళ వైసీపీ కోరుకొంటున్నట్లు విశాఖను రాజధాని చేయాలనుకొంటే నేడు వారు ఇంతగా గర్జించాల్సిన అవసరమే లేదు. ఈ మూడునరేళ్ళలో విశాఖలో రాజధాని ఏర్పాటు చేసి చూపి ఉండేవారు కదా? మరైతే ఈ హడావుడి ఘీంకారాలు ఎందుకు? అంటే మూడున్నరేళ్ళుగా చేయలేని పని మిగిలిన ఈ ఏడాదిన్నరలో ఎలాగూ చేయలేరు కనుక వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని విశాఖ రాజధాని అంటూ హడావుడి చేస్తున్నట్లు భావించవచ్చు.

విశాఖను రాజధానిగా వద్దంటున్నందుకు టిడిపి నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని వైసీపీ నేతలు జోస్యం చెప్పారు. కానీ అటు అమరావతిని పూర్తిచేయకుండా ఇటు మూడు రాజధానులను ఏర్పాటు చేయకుండా 5 ఏళ్ళు గడిపేసిన వైసీపీ ఏ చరిత్రలో కనిపిస్తుందో వారే చెప్పాలి.

రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేయలేక తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొంటూ ప్రజల దృష్టి మళ్ళించడానికి, పనిలో పనిగా ప్రజలను టిడిపికి వ్యతిరేకంగా మార్చడానికే వైసీపీ నేతలు ఈ డ్రామా మొదలుపెట్టారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

ఏపీ ప్రజలు వాస్తవాలను బేరీజు వేసుకొని తగిన నిర్ణయం తీసుకోగలరు కనుకనే ఆనాడు రాష్ట్రాన్ని విడదీసినందుకు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. వైసీపీ కూడా చేజేతులా అటువంటి దుస్థితి తెచ్చుకోకముందే ఆ పార్టీ నేతలు మేల్కొంటే వారికే మంచిది కదా?