YSR Congress Ministers support of three capitals ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అంటే ఆవు ఎక్కడుంటే దూడ కూడా అక్కడే… దాని మేత కూడా అక్కడే అని అందరికీ తెలుసు. వైసీపీ మంత్రులకు ఇది అక్షారాలవర్తిస్తుంది. ఎన్నికలకు ముందు ‘అమరావతే ముద్దు… మరో ఆలోచన వద్దే వద్దు…’ అని వారి అధినేత జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ నేతలందరూ తాన తందాన పాడారు. ఆ తర్వాత ఆయన మాట మార్చి మూడు రాజధానులు పాట అందుకొంటే వారు కూడా ఆ కొత్త పాటకు మూడున్నరేళ్ళుగా వంతపాడుతున్నారు తప్ప అనాడూ ఎవరూ ధైర్యంగా అమరావతి వద్దని అనలేదు… ఈనాడూ ధైర్యంగా మూడు రాజధానులు వెర్రి ఆలోచన అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. కనుక ఆవు వెంటే దూడ అన్నట్లు తమ అధినేతను గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు. ఆనాడు అమరావతి అద్భుతమని చెప్పిన నోటితోనే అదో శ్మశానం అని ఎలా అనగలిగారో వారికే తెలియాలి.

నేడు శాసనసభ స్పీకరుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆనాడు “మేము అమరావతిని రాజధానిగా టిడిపి ప్రతిపాదనకి ఇంత గట్టిగా మద్దతు ఇస్తుంటే ఇంకా మా మీద అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మేము అధికారంలోకి వస్తే అమరావతిని కట్టబోమని చెప్పలేదే?” అన్నారు. అదే నోటితో ఇప్పుడు “ఇది రాజధానా లేక రాజస్థాన్‌లో ఎడారా? బుద్ధున్నవాడు ఎవడైనా ఇక్కడ రాజధాని కట్టుకొంటారా?” అంటున్నారు.

ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారి ఏదోవిదంగా మంత్రి పదవి దక్కించుకొనే గొప్ప ప్రతిభ కలిగిన బొత్స సత్యనారాయణ నాలిక ఎప్పుడూ మడతేసే మాట్లాడుతారు. ఆ అలవాటు ప్రకారమే ఆనాడు “రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రాజధాని నిర్ణయిస్తే అక్కడే పెట్టాలని విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. గుంటూరు- విజయవాడ మద్య రాజధాని ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రతిపాదనకు మా పార్టీ పూర్తి మద్దతు ఇస్తోంది. భవిష్యత్‌లో మా పార్టీ అధికారంలోకి వచ్చినా అమరావతినే రాజధానిగా కొనస్గుతుంది తప్ప మార్చే ప్రసక్తే లేదు,” అని అన్నారు. ఇప్పుడు అదే నాలుకతో “ఇదో శ్మశానం… కృష్ణానదికి వరద వస్తే మునిగిపోతుంది. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచి పనిచేయాలనుకొంటే అదే రాజధాని. మూడు రాజధానులతోనే అభివృద్ధి సాధ్యం. గత ప్రభుత్వం తన రాజకీయ, కుల ప్రయోజనాలు చూసుకొంది తప్ప రాష్ట్రంలో మిగిలిన జిల్లాల అభివృద్ధిని పట్టించుకోకుండా అమరావతిని రాజధానిగా ఫిక్స్ చేసేసింది. కానీ రాష్ట్ర ప్రజలు తమ జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని, దానికి మూడు రాజధానులు ఒకటే పరిష్కారమని గట్టిగా నమ్ముతున్నారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొనే మేము మూడు రాజధానులు నిర్మించాలనుకొంటున్నాము. కానీ టిడిపి మాపై బురద జల్లుతోంది,” అని అన్నారు.

“మా శ్రీకాకుళం జిల్లా ఎప్పటికీ వెనకబడిపోవలసిందేనా?” అని ఇప్పుడు మొసలి కన్నీళ్ళు కార్చుతున్న మంత్రి ధర్మానప్రసాద రావుకి ఆనాడు అమరావతికి మద్దతు ఇచ్చినప్పుడు ఈ విషయం గుర్తులేదనుకోవాలా?

మంత్రులు ఆర్‌కె. రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, మాజీ మంత్రులు పేర్ని నాని, అవంతి శ్రీనివాసరావు, కన్నబాబు, వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు అందరూ ఆనాడు తమ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతిని పక్కన పడేస్తుందని చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు తమపై బురద జల్లుతూ ప్రజల మద్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించినవారే. నేడు వారే రైతుల పాదయాత్రపై విషం చిమ్ముతున్నారు. అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తున్నారు. వారి వికృత రాజకీయాలకు పరాకాష్టగా రేపు విశాఖపట్నంలో ర్యాలీ నిర్వహించి గర్జించబోతున్నారు. వచ్చే ఎన్నికలు ఏపీ ప్రజల విజ్ఞతకు పరీక్షవంటివి. కనుక వైసీపీని, నేతలను ఏపీ ప్రజలు మళ్ళీ అక్కున చేర్చుకొంటారో, లేక ఓడించి పక్కన పడేస్తారో వారే నిర్ణయించుకోవలసి ఉంటుంది.