వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో జైలుకు వెళ్ళిన సమయంలో… పార్టీ బాధ్యతలను, ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు జగన్ సోదరి షర్మిల. నాడు షర్మిల చేసిన ప్రసంగాలు, జగన్ వ్యాఖ్యలను మించిపోవడంతో కార్యకర్తలు, పార్టీ నేతలు ఆమెను నెత్తిన పెట్టుకున్నారు. స్వరంలో వినసొంపుగా ఉండనప్పటికీ, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరి ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడడంలో సిద్ధహస్తురలిగా షర్మిల ప్రశంసలు అందుకుంది. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.
ఎప్పుడైతే జగన్ బయటకు వచ్చారో, పార్టీలో గానీ, ప్రచారం విషయంలో గానీ షర్మిల దూరం అవుతూ వచ్చారు. ఇక ప్రతిపక్ష పార్టీగా అవతరించిన తర్వాత పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. తన పరంగా రాణించినప్పటికీ, జగన్ ను డామినేట్ చేసే విధంగా ప్రసంగాలు ఉండడంతో, షర్మిలను పక్కన పెట్టారని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం షర్మిల అనే పేరు అవుట్ ఆఫ్ ఫోకస్. నాడు ‘సిస్టర్’ సెంటిమెంట్ ప్రయోగించిన జగన్, త్వరలో ‘వైఫ్’ సెంటిమెంట్ ను వదలనున్నారని తెలుస్తోంది.
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ప్రముఖ మీడియా ఛానల్ కధనాలు ప్రసారం చేయడం దీనికి ప్రాధాన్యతను దక్కేలా చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి కుటుంబ సభ్యులంతా రాజకీయాల్లో ఉన్నారని, అందులో భాగంగా రేపు అనివార్య పరిస్థితులలో పార్టీ బాధ్యతలను చేపట్టాల్సి వస్తే… ఈ సారి ఆ బాధ్యతలను భారతి తీసుకునే అవకాశం ఉందనేది ఈ కధనాల సారాంశం.