Chandrababu Naidu Weepingనాడు నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానం, ఆ తదుపరి జరిగిన “కురుక్షేత్రం” యొక్క మహాభారత గాధ అందరికీ తెలిసిందే. అది ఒక చరిత్ర. కట్ చేసి ఆంధ్రప్రదేశ్ పెద్దలు ఆశీనులయ్యే అసెంబ్లీ సాక్షిగా నేడు తనపై మరియు తన కుటుంబంపై జరిగిన అవమానం నాటి కౌరవ సభను గుర్తు చేసిందని, ఇది “గౌరవ సభ కాదు, కౌరవ సభ” ఇందులో తానింకా ఉండలేను అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుండి బయటకు వచ్చేసారు.

అయితే నాడు ద్రౌపది ఎలా అయితే కౌరవులను శపించి ఆ కౌరవ సభను వీడారో, అలాగే నేడు చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ ఈ సభలోకి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేసి వీడారు. ఇన్ని అవమానాలు – నీచమైన రాజకీయం – వ్యక్తిగత దూషణ… తన జీవితంలో ఎన్నడూ చూడలేదని అన్న చంద్రబాబు నాయుడు, మీడియా ఉందని కూడా మరిచి గుక్కపెట్టి మరీ రోధించారు.

ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదు, మున్ముందు చూడకూడదు కూడా! ‘లోకేష్ ఎలా పుట్టాడో’ అంటూ వైసీపీ నేతలు చేసిన హేళనను తట్టుకోలేక చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాలపై ఎలాంటి పెను ప్రభావం చూపుతుందో వేచిచూడాలి. విశేషం ఏమిటంటే…

ఈ సభకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తిగత దూషణలు జరుగుతున్నపుడు చిరునవ్వులు చిందించడం! ఈ సందర్భంలో కూడా నాటి కౌరవ సభ ఉదంతాలలోని… దుర్యోధన దుశ్శాసన శకుని చిరుదరహాసాలు జ్ఞప్తికి రావడంలో తప్పు లేదు! ఆ మహా చరిత్ర అలాంటిది మరి! బహుశా అందుకే చంద్రబాబు దీనిని ‘కౌరవ సభ’గా అభివర్ణించారేమో!