YSR Congress Government
అధికారంలోకి వచ్చిన నాటి నుండీ ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని బలహీనం చేసే ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి చేస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ తరపున అసెంబ్లీలో బలంగా వాణి వినిపించే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని టార్గెట్ చేశారని టీడీపీ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఏపీ ఈఎస్ఐలో మందుల కొనుగోలు స్కాంలో అచ్చెన్నను ఇరికించేప్రయత్నం చేస్తున్నారని వారు అంటున్నారు.

సాక్షిలో వచ్చిన ఒక కథనం ప్రకారం… మందుల కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగాయట. అచ్చెన్నకు చెందిన టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ కంపెనీకి కాంట్రాక్ట్‌ అప్పగించాలని ఈఎస్‌ఐ డైరెక్టర్లకు లేఖ రాసినట్లు, టెండర్ల పద్దతిలో కాకుండా నామినేషన్ ప్రక్రియలో మంత్రిగారు నిబంధనలను ఉల్లంఘించి భారీ అవినీతికి తెరలేపారని ఆరోపణ.

అయితే ప్రధాని ఆదేశాల ప్రకారమే పనులు నిర్వహించామని, నామినేషన్‌పై వర్క్‌ ఆర్డర్ల ఇవ్వడంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అచ్చెన్న స్పష్టం చేశారు. ‌తెలంగాణలో ఎలా అమలు చేశారో.. అలాగే అమలు చేశామని తెలిపారు. తాను రాసిన అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లోనూ అదే విషయం ఉందన్నారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అచ్చెన్నాయుడు తెలిపారు. “అవినీతి ఆరోపణలు చేస్తే… అచ్చెన్న భయపడి సైలెంట్ అయిపోతారని ప్రభుత్వ అంచనా. ఇప్పటికే అసెంబ్లీలో అధికారపక్షం దిగజారి ఆయన ఆకారం మీద కూడా చేసిన విమర్శలు చూశాం. టీడీపీ వాణి వినిపించేవారు లేకపోతే పార్టీ బలహీనపడుతుందని అంచనా. అందుకే బీసీ నాయకుడు అని కూడా లేకుండా కక్షసాధింపుకి పాల్పడుతున్నారు,” అని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు.