అప్పుడు లేచిన నోర్లు... ఇప్పుడు లేవవేం..!తమ సినిమాలకు నంది అవార్డులను ప్రకటించడంలో అన్యాయం జరిగిందంటూ నాడు తెలుగుదేశం ప్రభుత్వంపై సినీ ఇండస్ట్రీ ఓ విధంగా ముప్పేట దాడి చేసిన విషయం తెలిసిందే. ‘రుద్రమదేవి’కి ఇవ్వకుండా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి ఇవ్వడమేంటి? అని ఒకరు, ఇవి కమ్మ అవార్డుని మరొకరు, సైకిల్ అవార్డులని ఇంకొకరు… ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు మీడియాలకెక్కి తమ ఆవేదనను వెలిబుచ్చుకున్నారు.

నిజమే… ప్రజాస్వామ్యంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. తాము ఎంతో వ్యయప్రయాసలకు ఒడ్డి తీసిన సినిమాలకు అవార్డులు వస్తాయని ఆశించిన వారు భంగపాటుకు గురై ఆక్రోశించడంలో అర్థముంది.

అయితే ఆ అవార్డులు నిజంగా వాళ్ళు ఆశించినట్టు ప్రకటించినా… ప్రభుత్వ పరంగా ఇచ్చే అత్యధిక బహుమానం కేవలం లక్ష రూపాయలు మాత్రమే! స్పష్టంగా చెప్పాలంటే… ఒక లక్ష రూపాయల అవార్డు కోసం నాడు అధికార పార్టీని ఏకిపారేశారు.

మరి నేటి పరిస్థితి ఏంటి? లక్ష కాదు, కోటి కాదు, ఏకంగా సినీ పరిశ్రమ మనుగడే ప్రశ్నార్ధకంగా చేయడంలో జగన్ సర్కార్ కీలక పాత్ర పోషించింది. మరి ఇప్పుడు తమకు జరిగిన అన్యాయం గురించి ఏ ఒక్కరూ పెదవి విప్పరేం! భయమా? లేక భక్తా? ఏమనుకోవాలో!?

అందుకే నెటిజన్లు కూడా సినీ ఇండస్ట్రీకి జగన్ లాంటి వారే కరెక్ట్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. నాడు చిత్ర పరిశ్రమకు రెడ్ కార్పెట్ పరిచి మరీ చంద్రబాబు ఆహానిస్తే, నేడు అదే ఇండస్ట్రీ కళ్ళల్లో రక్త కన్నీరు కారుతున్నా పట్టించుకునే నాధుడే లేకపాయే! అంటూ వాపోతున్నారు.

తాము ఎప్పుడూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం… అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా ఊకదంపుడు ప్రసంగాలు చేసే ఇండస్ట్రీ హీరోలు, నిర్మాతలంతా ఒకే వేదిక మీదకు వచ్చి, వారికి కావాల్సిన వాటిని న్యాయంగా పోరాడి సాధించుకోలేరా?