ysr-congress-campaign-ys-sharmilaజగన్‌ సోదరి షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ కోసం బస్సు యాత్ర తో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలో ఆమె ఈరోజు ప్రచారం చేశారు. ఆమె రాక సందర్భంగా ఆ పార్టీ అభిమానులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా కపిలేశ్వరపురం వద్ద ఓ ద్విచక్ర వాహనంపైకి షర్మిల వెళుతున్న బస్సు దూసుకెళ్లింది. త్రుటిలో ఆ యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. యువకుడిని రక్షించాల్సింది పోయి భద్రతా సిబ్బంది అతిగా ప్రవర్తించారు.

ఆ యువకుడి పై చేయి చేసుకుని పక్కకు నెట్టేశారు. స్థానిక యువకులు వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇవేమి పట్టించుకోకుండా షర్మిల ముందుకు వెళ్లిపోయారు. గత వారం షర్మిల ప్రయాణిస్తున్న బస్సు నుండి అభిమానులతో కరచాలనం చేస్తుండగా ఒక వ్యక్తి ఆమె చేతి ఉంగరం లాగేసే ప్రయత్నం చేశాడు. దీనితో అప్పటి నుండి ఆమె భద్రతా విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పార్టీ నాయకులు సర్ది చెప్పుకుంటున్నారు.

ఎన్నికలు దగ్గర పడటంతో జగన్ ఒక వైపు, విజయమ్మ ఇంకో వైపు, షర్మిల మరోవైపు పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు. దీనితో ప్రతి రోజూ రాష్ట్రంలో నలుమూలల పార్టీని ఉత్తేజితంగా ఉంచడానికి వీలు అవుతుంది. ఏప్రిల్ 9వ తారీఖుతో ప్రచారం పూర్తి అవుతుంది. 11వ తారీఖున ఓటింగు జరగబోతుంది. పార్టీల భవిష్యత్తు తేలాలంటే మే 23 వరకూ ఆగాల్సిందే. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికలను తమ జీవన్మరణ సమస్యగా భావించి తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు.