ysr congress bjp presidential electionsత్వరలో జరుగబోయే రాష్ట్రపతి ఎన్నికలో బిజెపియేతర పార్టీలు ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలనే ఆలోచనతో నిన్న ఢిల్లీలో సమావేశమయ్యాయి. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించారు. కానీ ఇద్దరూ హాజరుకాలేదు. వారి పార్టీల ప్రతినిధులను కూడా పంపలేదు.

తెలంగాణ సిఎం కేసీఆర్‌ బిజెపితో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా వ్యతిరేకిస్తున్నారు గనుక కాంగ్రెస్‌ హాజరైన ఈ సమావేశానికి దూరంగా ఉండిపోయారు. అయితే ఆయన ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలలో ఇంతవరకు ఎవరెవరిని కలిశారో వారి పార్టీలన్నీ ఈ సమావేశానికి హాజరుకావడం కేసీఆర్‌కు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధిని ఖరారు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించడం మరో పెద్ద షాక్.

బిజెపిని వ్యతిరేకించే విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలనే ఆయన ఆలోచనను మమతా బెనర్జీ హైజాక్ చేసినట్లే చెప్పవచ్చు. పైగా కేసీఆర్‌ కలిసిన పార్టీల అధినేతలందరూ కాంగ్రెస్‌తో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నందున జాతీయ రాజకీయాలలో కేసీఆర్‌ ఒంటరి పోరాటం చేయవలసి వస్తుందేమో?

సిఎం జగన్మోహన్ రెడ్డి ఏపీకే పరిమితం కావాలనుకొన్నారు. మోడీ ప్రభుత్వానికి అండగా నిలబడాలనుకొంటున్నారు కనుక ఈ సమావేశానికి హాజరు కాలేదని భావించవచ్చు. ఎన్డీయే అభ్యర్ధికి వైసీపీ మద్దతు ఇస్తే చాలు అవలీలగా రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. వైసీపీ ఇందుకు సిద్దంగానే ఉంది కనుక ఎన్డీయే అభ్యర్ధిని ఖరారు చేయక మునుపే విజయం సాధించినట్లు భావించవచ్చు.

వైసీపీ-బిజెపిల మద్య ఎటువంటి పొత్తులు లేనప్పటికీ ఈవిదంగా సహకరించుకొంటూ, మరో పక్క రాష్ట్రంలో కత్తులు దూసుకొంటున్నట్లు నటిస్తూనే టిడిపి-జనసేనలు కుమ్మక్కు అయ్యాయని, చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్‌ దత్తపుత్రుడు అని ఆక్షేపిస్తుండటం హాస్యస్పదంగా ఉంది. గతంలో కలిసి పనిచేసిన టిడిపి, జనసేనలు మళ్ళీ పొత్తులు పెట్టుకోవాలనుకోవడం నేరమూ కాదు. అప్రజాస్వామ్యం… అనైతికం కూడా కాదు.

రాష్ట్రానికి నిధుల విడుదల, అప్పులకు అనుమతి, అక్రమాస్తుల కేసులలో ఉపశమనం కోసం వైసీపీ కేంద్రానికి మద్దతు ఇవ్వడం, అందుకు ప్రతిగా కేంద్రం వైసీపీకి సహకరిస్తోందని అర్దమవుతూనే ఉంది. కనుక వైసీపీ-బిజెపిల ఈ రహస్య అనుబందమే అనైతికమైనదని చెప్పక తప్పదు. అయితే తమ పొత్తుల గురించి సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ మంత్రులు ఎంతగా విమర్శిస్తున్నా బిజెపి-వైసీపీల ఈ అనైతిక బందం గురించి టిడిపి ప్రశ్నించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.