ఏపీ – తెలంగాణా మంత్రుల నడుమ ప్రారంభమైన ‘అడుక్కునే’ మాటల యుద్ధం, ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా టీఆర్ఎస్ – వైసీపీ వర్గీయుల మధ్య జరుగుతోంది. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ‘నిధుల కోసం కేంద్రం దగ్గర అడుక్కోకపోతే ఏపీకి రోజు గడవదు’ అన్న వ్యాఖ్యలకు కౌంటర్ గా ఏపీ మంత్రి పేర్ని నాని ‘మీ కేసీఆర్ లాగా బయట కాలర్ ఎగరేసి, లోపలికెళ్ళి కాళ్ళు పట్టుకోవడం మాకు తెలియదులే’ అన్న వ్యాఖ్యలు ‘ఫ్రైడే ఫీవర్’ను కలిగించాయి.

దీని తర్వాత ఈ నిప్పురవ్వలు సోషల్ మీడియాను తాకి భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ వర్గీయులు వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన పోస్ట్ లతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటించిన సమయంలో… వైఎస్ జగన్ వొంగి కాళ్లకు నమస్కరించిన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ… ‘కనీసం బయట కూడా కాలర్ ఎగరేయకుండా, బహిరంగంగానే కాళ్ళ మీద పడిపోతారా?’ కౌంటర్లు ఇస్తున్నారు.

దీంతో ఒక విధంగా నెట్టింట వైసీపీ అండ్ టీఆర్ఎస్ అభిమానులు ప్రత్యక్ష యుద్ధానికే తెరతీశారు. ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఇద్దరు నాయకులు మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు గడవాలి గానీ, సగటు రాజకీయ పార్టీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో కాలర్స్ ఎగరేస్తున్నారు.