YS Jagan YSR districts name changeవైఎస్ జగన్ సర్కార్ రేపిన జిల్లా పేరు మార్పుల రాజకీయం పుణ్యమా అంటూ గతం విశ్లేషించే పనిలో పలువురు ప్రముఖులు తమ విశ్లేషణలను అందిస్తున్నారు. అందులో భాగంగానే అసలు ఈ “పేర్లు పెట్టడం – పేర్లు మార్చడం” వంటి వాటిని వివరిస్తూ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అలాగే అసలు ఈ పేర్లు మార్పుకు శ్రీకారం చుట్టింది ఎవరో కూడా ఈ వీడియోలో వివరించారు.

పేర్లు పెట్టడానికి – పేర్లు మార్చడానికి చాలా వ్యత్యాసం ఉందని, నాడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం అనేక వాటిని అభివృద్ధి చేసి పేర్లను పెట్టిందని, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ స్వార్ధ రాజకీయాల కోసం పేర్లకు మార్పు చేసిందని, ఈ రెండింటిని గమనించాలని స్పష్టంగా తెలిపారు.

చంద్రబాబు ప్రభుత్వంలో యూసుఫ్ గూడలో నిర్మించిన ఇండోర్ స్టేడియంకు పెట్టిన పేరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి. అదే సమయంలో మరో రెండు పార్క్ లను అభివృద్ధి చేసిన కాంగ్రెస్ నేతలైన జలగం వెంగళరావు మరియు కృష్ణకాంత్ ల పేర్లు పెట్టింది కూడా చంద్రబాబు సర్కారే అని ఈ సందర్భంగా గుర్తు చేసారు.

మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో ఉన్న పార్క్ ను అభివృద్ధి చేసి, నేషనల్ హోదా తీసుకువచ్చిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కిందని, అలాగే ఏఎంటిజెడ్ లో అబ్దుల్ కలాం గారి బొమ్మలు, అబ్దుల్ కలాం గారి పేరుతో కొత్తగా అవార్డులను తీసుకువచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమేనని తెలిపారు.

చంద్రబాబు నేతృత్వంలో కట్టించిన మరికొన్నింటికి బాలయోగి పేరు, హైటెక్ సిటీ, మిలీనియం టవర్స్, సిగ్నేచర్ టవర్స్ అని… ఇలా తాము కట్టించిన వాటికి టీడీపీ ఇలా పేర్లు పెట్టిందని, కానీ ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పేర్లను మార్చిందని అన్నారు. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ఎన్టీఆర్ పేరు మార్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టారని ప్రస్తావించారు.

ఢిల్లీ పెద్దల మెప్పు కోసం ఏపీలో అన్నింటికీ ఇందిర, రాజీవ్ పేర్లను పెట్టారని, అలా పేర్లు పెట్టడంలో కూడా రాజకీయానికి తెరలేపిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆ తర్వాత ఇదే కోవలో ఇపుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే చేస్తున్నారని, అధికారం చేపట్టిన వెంటనే వైజాగ్ లోని సెంట్రల్ పార్క్ పేరు మార్చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారని తెలిపారు.

అలాగే విజయవాడలోని పార్క్ లో అవతార్ బొమ్మ తీసేసి రాజశేఖర్ రెడ్డి బొమ్మ, తెలుగుదేశం కట్టించిన హైలెవల్ బ్రిడ్జి పేరుకు వైఎస్ వారధి అని, టిడిపి కట్టించిన ఇళ్లకు, గుళ్ళకు, బళ్ళకు ఇలా అన్నింటికీ రంగులు మార్చి వైసీపీ రంగులు పులిమారు. ఇప్పుడు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి కృతజ్ఞతలు తెలపండి అంటున్నారు, ఇది పేరు మార్చడం తప్పితే పేరు పెట్టడం కాదని అన్నారు.

నిజంగా వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా కొత్తగా అభివృద్ధి చేసి దానికి పేరు పెట్టి, అప్పుడు కృతజ్ఞత అడగడంలో అర్ధం ఉంటుంది గానీ, పేరు మార్చి కాదంటూ హితవు పలికారు. ఒకవేళ పేరు మార్పుకు కూడా కృతజ్ఞతలు తెలపాలంటే, ముందుగా రోశయ్య, సోనియా గాంధీలకు కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టినందుకు కృతజ్ఞత తెలిపి అడిగితే సబబుగా ఉంటుందని అన్నారు. లాజికల్ గా స్పష్టంగా ఆధారాలతో సహా వివరించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.