YSR - Ayesha Satyambabu Murder Latest Newsవిజయవాడకు సమీపంలో గల ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్ లో బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాను అత్యంత పాశవికంగా 2007లో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సెషన్స్ కోర్టు నిందితుడు సత్యంబాబుకు జీవిత ఖైదు విధించగా, దీనిని విచారించిన హైకోర్టు ఈ కేసులో సత్యంబాబు నిర్దోషి అని సంచలన తీర్పు ప్రకటించింది. దీనిపై బాధితురాలు ఆయేషా మీరా తల్లి షంషాద్‌ బేగం కూడా హర్షం వ్యక్తం చేశారు.

ఈ కేసులో చివరకు న్యాయమే గెలిచిందని, న్యాయవ్యవస్థ మంచి తీర్పు ఇచ్చిందని, కోర్టు ఆదేశించినట్టు పోలీసులు సత్యంబాబుకు లక్ష రూపాయలు కాదని, కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాను మొదటి నుంచి సత్యం బాబు నిర్దోషని చెబుతున్నానని, అసలు నిందితులను వదిలేసి పోలీసులు నాటకాలాడారని, ఇప్పటికైనా అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

అయితే ఈ కేసులో అసలు దోషులు ఎవరు? అంటే అయేషా మీరా తల్లి మాత్రం కోనేరు రంగారావు మనవడు అని కొన్ని సంవత్సరాలుగా బల్లగుద్ది చెప్తున్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ కేసులో చక్రం తిప్పారని, అప్పుడే పోలీసులు తెరపైకి సత్యంబాబును తీసుకువచ్చారని అప్పట్లో మీడియా వర్గాలు కూడా కధనాలను ప్రసారం చేసింది. అరెస్ట్ చేసే సమయంలో పూర్తి ఆరోగ్యంగా ఉన్న సత్యంబాబు రెండు నెలలకే నడవలేని స్థితికి మారిపోవడం వెనుక కూడా కుట్ర దాగి ఉందని అప్పట్లో సత్యంబాబు తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేసారు.

ఇప్పటికైనా తమకు అనుకూలంగా వచ్చిన తీర్పుపై సత్యంబాబు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేయవచ్చు. అయితే ఎలాంటి నేరం చేయకుండా, సత్యంబాబు అనుభవించిన ఏడు సంవత్సరాల జైలు శిక్షా కాలానికి ఎవరు బాధ్యులు? తన వారిని కాపాడుకోవడం కోసం చక్రం తిప్పారని ఆరోపణలు ఎదుర్కొన్న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఖాతాలోకే వెళ్తుందా? లేక రాజకీయ ఒత్తిడిలకు లొంగి ఒక అమాయకుడి జీవితాన్ని బలిచేసిన పోలీసులకు చెందుతుందా? ప్రస్తుతం ఇన్ని ప్రశ్నలను ఆలోచించే పరిస్థితుల్లో సత్యంబాబు కుటుంబం ఉండకపోవచ్చు, ఇప్పటికైనా ప్రాణాలతో బయటపడడం వారికి ఊరట కలిగించే విషయం.