YSJagan-Kapu-Nestham-Pithapuram-సిఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాపు నేస్తం 3వ విడత నిధులను రేపు బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. రేపు ఉదయం కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు నగర పంచాయతీలో ఈ బటన్ నొక్కుడు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పధకం ద్వారా 45-60 ఏళ్ళలోపు అర్హులైన కాపు మహిళలకు ఒక్కొక్కరికీ రూ.15,000 చొప్పున వారి బ్యాంక్ ఖాతాలలో జమా అవుతుంది. ఏటా దీని కోసం జగన్ ప్రభుత్వం రూ.490 కోట్లు కేటాయిస్తోంది కనుక ఈసారి కూడా అంతే మొత్తం కేటాయించినట్లు భావించవచ్చు.

పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ప్రజలకు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, కేంద్రం ఇస్తేనే ఇస్తామని సిఎం జగన్మోహన్ రెడ్డి నిన్ననే చెప్పారు. మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని ముత్తుకూరు గ్రామంలో మంత్రి గుమ్మనూరు జయరాం గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు పూర్తిగా పాడైపోయాయని వాటి పనులు మొదలు పెట్టేందుకు గత ఏడాది శంకుస్థాపన చేశానని కానీ నిధులు లేక పనులు మొదలుపెట్టలేదని చెప్పారు.

ఈ సమస్యను సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళగా ఆగస్ట్ నెలలో రూ.2,000 కోట్లు వస్తాయని వాటిలో కేటాయిస్తానని ముఖ్యమంత్రిగారు హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,000 కిమీ రోడ్లు పూర్తిగా గుంతలు పడి నడుచుకు వెళ్ళేందుకు కూడా పనికిరాని స్థితిలో ఉన్నాయని సంబందిత శాఖ నివేదికలే చెపుతున్నాయి. కానీ వాటి కంటే ఓట్లు రాల్చే సంక్షేమ పధకాలే ముఖ్యమని సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమంతో స్పష్టమవుతోంది.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దయనీయంగా ఉందని ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం, దేశంలో చాలా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఒక సమర్దుడైన ముఖ్యమంత్రి చేతిలో రాష్ట్రం ఉంది,” అని ఓ సర్టిఫికేట్ ఇచ్చేశారు.

కేంద్ర ప్రభుత్వం కంటే ఏపీ ఆర్ధిక పరిస్థితి చాలా బాగున్నప్పుడు గుంతలు పడి చెరువుల్లా మారిన రోడ్లకు ఎందుకు మరమత్తులు చేయించడం లేదు?సంక్షేమ పధకాలలో మళ్ళీ కోతలు, ప్రజలపై చార్జీల బాదుడు ఎందుకు? ఓ పక్క లంక గ్రామాలలో వరద బాధితులు నానా కష్టాలు అనుభవిస్తుంటే వారికి ఆర్ధిక సాయం చేయకుండా, సంక్షేమ పధకాల కోసం బటన్ నొక్కడం వివేకమనిపించుకొంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు పాడైనా పట్టించుకోకపోవడమే సమర్దతా?