ys Vivenkananda reddy murder case అనేక మలుపుల నడుమ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వస్తోందన్న సూచనలు కనపడుతున్నాయి. ఈ కేసు వైసీపీ మెడకు చుట్టుకునే సంకేతాలు కనపడుతుండడంతో, ప్రభుత్వ సలహా దారుడు అయిన సజ్జల సీబీఐ తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా పరిణామాలను ఒక్కసారి పరిశీలిస్తే…

సీఐ శంకరయ్య వాంగ్మూలం :

వివేకా హత్య జరిగిన సమయంలో విధులు నిర్వహిస్తోన్న పులివెందుల సీఐ శంకరయ్య, సీబీఐకు పలు సంచలన విషయాలు వెల్లడించినట్లుగా బయటకు వచ్చింది. హత్య సమాచారం అందుకున్న వెంటనే తాను ఘటనా స్థలానికి చేరుకున్నానని, అప్పటికే కొందరు వ్యక్తులు ఫ్రీజర్‌ను తీసుకొచ్చి మృతదేహాన్ని అందులో పెట్టేందుకు ప్రయత్నించగా, పోస్టుమార్టం చేయించిన తర్వాత ఫ్రీజర్‌లో పెట్టాలని ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి తేల్చి చెప్పానన్నారు.

ఆ విషయాన్ని అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, ఆ తర్వాత శివశంకర్‌రెడ్డి అంబులెన్స్ పిలిపించారని వివరించారు. న్యాయవాది ఓబుల్‌రెడ్డి వివేకా ఇంటికి వచ్చిన తర్వాత లోపలున్న రక్తపు మరకలను చూసి బయటకు వచ్చి గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డితో మాట్లాడారని, ఆ తర్వాతే ఆధారాల ధ్వంసం కార్యక్రమం మొదలైందన్నారు.

వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని, ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న జనాన్ని నియంత్రించేందుకు సిబ్బందిని పంపాలని తనకు అవినాష్‌రెడ్డి నుంచి ఫోన్ వచ్చిందని, దీంతో ముగ్గురు కానిస్టేబుళ్లతో కలిసి వెంటనే తాను ఘటనా స్థలానికి చేరుకున్నట్టు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో శంకరయ్య తెలిపారు. తాను అక్కడికి వెళ్లాక వివేకా ఇంట్లోకి కానిస్టేబుళ్లు వెళ్లకుండా శివశంకర్‌రెడ్డి అడ్డుకున్నారని, తనను మాత్రమే లోపలికి పంపారని పేర్కొన్నారు.

అయితే స్నానాల గది, పడకగదితో పాటు వివేకా మృతదేహంపై రక్తపు మరకలు, గాయాలు చూసి అది గుండెపోటు అని అనిపించడం లేదని శివశంకర్‌రెడ్డితో చెప్పానని, దీంతో ఆయన తీవ్రంగా స్పందించారని పేర్కొన్నారు. నోర్మూసుకుని ఉండాలని, గాయాల విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని శివశంకర్‌రెడ్డి తనను హెచ్చరించారన్నారు.

వివేకా సహాయకుడు ఇనయతుల్లా కూడా మృతిపై అనుమానం వ్యక్తం చేస్తే, మీ సార్‌కు ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఆయన్ను ఎవరూ హత్య చేసే అవకాశమే లేదని శివశంకర్‌రెడ్డి ఆయనను కూడా బెదిరించారని శంకరయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. బాత్రూములో హత్యకు గురైన వివేకా మృతదేహాన్ని గంగిరెడ్డి బెడ్రూములోకి తీసుకొచ్చారని, రక్తపు మరకలతో ఉన్న ఆయన దుస్తులను మార్చేందుకు ప్రయత్నించారని అన్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించాలని, కాబట్టి దుస్తులు మార్చడానికి వీల్లేదని తాను చెప్పానని, అంతేగాక ఘటనా స్థలాన్ని వీడియో తీయాలని తమ సిబ్బందికి చెప్పానని, వారు ఆ పని చేస్తుండగా, వీడియో తీయొద్దంటూ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి గట్టిగా కేకలు వేశారన్నారు. ఎర్ర గంగిరెడ్డి, ఎవీ కృష్ణారెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి పాత్ర అనుమానాస్పదంగా అనిపించిందని కూడా చెప్పారు.

అలాగే ఘటనా స్థలంలో అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి ప్రవర్తించిన తీరు కూడా అనుమానాలు రేకెత్తించిందని శంకరయ్య వివరించారు. వివేకా ఇంటి వద్ద బందోబస్తుకు రావాలంటూ వైసీపీ సన్నిహిత న్యాయవాది ఓబుల్‌రెడ్డి, సాక్షి విలేకరి తనపై ఒత్తిడి తీసుకొచ్చారని, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డే తొలుత ప్రచారం ప్రారంభించారని శంకరయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ కేసులో గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి పాత్ర కూడా అనుమానాస్పదంగా ఉన్నట్టు తన దర్యాప్తులో వెల్లడైందని పులివెందుల డీఎస్పీగా గతంలో పనిచేసిన రెడ్డివారి వాసుదేవన్ సీబీఐకి తెలిపారు.

రక్షణ కావాలన్న దస్తగిరి :

రెండో వాంగ్మూలం తర్వాత తనకు భద్రత కావాలనిపిస్తోందని, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తనకు ప్రాణభయం వుందని ఆందోళన వ్యక్తం చేశాడు. రక్షణ కల్పించాలని ఎస్పీని, సీబీఐ అధికారులను కోరానని తెలిపాడు. తనకు, తన కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబ సభ్యుల కోసమే ఈ కేసులో అప్రూవర్ గా మారానని, అప్రూవర్ గా మారడంలో తనపై ఇతరుల ప్రలోభాలు లేవని దస్తగిరి స్పష్టం చేశాడు.

సీబీఐ అధికారిపై కేసు :

ఈ కేసు ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందంలోని అధికారి రాంసింగ్‌పై ఏకంగా కేసు న‌మోదు అయ్యింది. వివేకా హ‌త్య కేసు ద‌ర్యాప్తులో తాము చెప్పిన‌ట్లుగానే చెప్పాలని రాంసింగ్ బెదిరిస్తున్నార‌ని ఉద‌య్ కుమార్ రెడ్డి అనే వ్య‌క్తి స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా క‌డ‌ప రిమ్స్ స్టేష‌న్‌లో రాంసింగ్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

దస్తగిరి ఆడియో టేప్ :

వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్ యాదవ్.. వివేకా డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంపై స్పందించాడు. దస్తగిరి వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ, తనతో దస్తగిరి మాట్లాడిన ఓ ఆడియోను భరత్ యాదవ్ విడుదల చేశాడు. దస్తగిరి ఆరోపణలేవీ నిజం కాదని, అతడిని ఎవరూ బెదిరించలేదని, అయినా అప్రూవర్ గా మారాక ఎందుకు బెదిరిస్తారని ప్రశ్నించాడు.

మామిడి తోట వద్దకు దస్తగిరిని ఎవరూ రమ్మనలేదని, లాయర్ ఓబుల్ రెడ్డిని కలవాలంటూ చెప్పలేదని, డబ్బుల కోసమే తమపై దస్తగిరి ఆరోపణలు చేస్తున్నాడని, డబ్బులు కావాలంటూ పదేపదే అడిగేవాడని పేర్కొన్నాడు. వైఎస్ కుటుంబ సభ్యులను వివేకా హత్యకేసులో కచ్చితంగా ఇరికిస్తానంటూ దస్తగిరి బెదిరించేవాడని, అందులో భాగంగానే ఇప్పుడు వారిని ఇరికించేందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని భరత్ యాదవ్ ఆరోపించాడు.

జరుగుతోన్న తాజా పరిణామాలు ఒక్కటైతే స్పష్టం చేస్తున్నాయి. వివేకా హత్య కేసు అధికార పార్టీ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందా? అన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో కనపడుతుండగా, సీబీఐకు కౌంటర్ ఇచ్చేందుకు అధికార పార్టీ కూడా సన్నద్ధం అవుతుందన్న సంకేతాలు లేటెస్ట్ గా విడుదల చేసిన ఆడియో టేప్ లతో స్పష్టమవుతోంది.