వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడైన దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో కదులుతోన్న ‘కడప డొంక’ ఎక్కడి వరకు వెళ్తుందోనని ఏపీ పొలిటికల్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేసిన సీబీఐ అధికారులు, తదుపరి అరెస్ట్ ను ధృవీకరిస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ అంశంపై స్పందించిన నారా లోకేష్ పలు సంచలన ఆరోపణలు చేసారు.

దస్తగిరి వాంగ్మూలం ప్రకారం గొడ్డలిపోటు సూత్రధారి అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ కేసు నుండి తప్పించేందుకు సిట్ బృందాన్ని మార్చేసిందని, జగన్ సీబీఐ విచారణ వద్దన్నారని అన్న లోకేష్, “మీ బ్లూ మీడియాలో ఈ వైఎస్సాసుర రక్తచరిత్ర గురించి ఎప్పుడు రాయిస్తారో?” అంటూ ఎద్దేవా చేసారు. మొత్తానికి కేసులో జరుగుతున్న కీలక పరిణామాలలో ‘క్లైమాక్స్’ ఎలా ఉంటుందనేది సగటు ప్రజానీకం ఎదురు చూస్తున్న అంశం.