వైఎస్ వివేకా మర్డర్... ఇట్స్ లోకేష్ టైం..! 2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి కేసులో చిక్కుముడులు విడిపోతున్నాయి. వివేకాకు డ్రైవర్ గా విధులు నిర్వహించిన దస్తగిరి అప్రూవర్ గా మారి ఇచ్చిన ‘కన్ఫెషన్ స్టేట్మెంట్’ ద్వారా అసలు నిందితులు ఎవరో బయటకు వచ్చారు.

ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమా శంకర్ రెడ్డితో కలిసి వైఎస్ వివేకాను హత్య చేసినట్లుగా చెప్పిన దస్తగిరి, ఈ హత్యకు 40 కోట్లకు సుపారీ ఒప్పందాలు జరిగినట్లుగా స్టేట్మెంట్ లో వెల్లడించారు. ఇందులో తనకు 5 కోట్లు ఇస్తామని చెప్పి, అడ్వాన్స్ గా ఒక కోటి రూపాయలు ఇచ్చినట్లుగా వెల్లడించారు.

ఈ ‘కన్ఫెషన్ స్టేట్మెంట్’లో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా చోటు చేసుకుంది. అవినాష్ – వివేకాలకు మధ్య జరిగిన వాగ్వివాదాన్ని పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య జరిగిన నాటి నుండి నేటి వరకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ హత్య వెనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నట్లుగా తన మీడియాల ద్వారా తప్పుడు ప్రచారం చేసిన వైసీపీ అధినేత ఇప్పుడు ఎలాంటి సమాచారాన్ని తన మీడియా సంస్థల ద్వారా వెల్లడిస్తారో!?

ఇప్పుడిప్పుడే వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్న నారా లోకేష్ కు ఇది మంచి అవకాశంగా మారింది. ఈ సమాచారం వెలువడిన వెంటనే ట్విట్టర్ వేదికగా జగన్ మరియు సంబంధిత మీడియాను ఎద్దేవా చేస్తూ తన భావాలను పంచుకున్నారు. ‘వివేకాపై గొడ్డలి వేట్లు మీ ఇంటివేనట కదా… ఇప్పుడేం రాయిస్తారు మీ సాక్షిలో…!’ అంటూ గతంలో చంద్రబాబు మీద సాక్షి ప్రచురితం చేసిన పేపర్ కటింగ్ ను పోస్ట్ చేసారు