YS Vivekananda Reddy murderవైఎస్ జగన్ బాబాయ్ వివేకా హత్య కేసు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం. హత్య విషయాన్ని ఎందుకు దాచి పెట్టారు..? సహజ మరణంగా ఎందుకు చిత్రీకరించాలనుకున్నారు..? పోస్టుమార్టం ఎందుకు వద్దనన్నారు..? కేసులు కూడా అవసరం లేదని ఎందుకన్నారు..? ఇటువంటి అంశాలతో పాటు పాత కక్షలు… రాజకీయ వైరం పై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. డ్రైవర్ ప్రసాద్, పనిమనిషి లక్ష్మి, ఆమె కుమారుడు, పీఏ కృష్ణారెడ్డిలను పోలీసులు విడివిడిగా ప్రశ్నించారు.

డ్రైవర్ ప్రసాద్ పై హత్యానేరం వచ్చేలా ఉన్న లేఖ వివేకా రాసింది కాదు అనే అనుమానం కూడా ఉంది. సున్నితమైన ఇష్యూ.. రాజకీయం చేస్తూండటంతో.. పోలీసులు పక్కా ఆధారాలతోనే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే.. కేసు చిక్కుముడి దాదాపుగా వీడిపోయిందని… కొన్ని సాంకేతిక అంశాలపై ఆధారాలు సేకరించిన తర్వాత అసలు నిందితుల్ని అరెస్ట్ చేస్తామని.., పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వారం రోజులలో ఈ కేసు మొత్తానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

ఎన్నికల సమయంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు సానుభూతి వచ్చేలా అధికార పక్షం ఇటువంటి చర్యలకు ఉపక్రమించదు అని స్థానిక ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. . గత కొంత కాలంగా కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీనితో ఇది కుటుంబంలోని వారి పనే అని పులివెందులలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. అటువంటి పాత్ర ఏదైనా తేలితే అది వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎన్నికల ముందు ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉంది.