YS-Vivekananda-Reddy-Murder-Case-Supreme-Court-Telanganaవివేకానంద రెడ్డి హత్య కేసులో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మలుపులే తప్ప ఎప్పటికీ ముగింపు ఉండదేమో?అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దానిపై జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ చేపట్టి ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసు విచారణని తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేస్తున్నట్లు తీర్పు చెప్పింది.

వివేకా హత్య కేసుని తెలంగాణకి బదిలీ చేసినందున ఈ కేసుని తెలంగాణ హైకోర్టుకే బదిలీ చేస్తున్నామని, ఈ కేసుని మరింత లోతుగా విచారణ జరిపి గంగిరెడ్డికి బెయిల్‌ రద్దు చేయాలో వద్దో హైకోర్టు నిర్ణయించాలని సుప్రీంకోర్టు తాజా తీర్పులో పేర్కొంది. దీంతో ఓ వీఐపీ హత్య కేసులో ప్రధాన నిందితుడు బెయిల్‌పై స్వేచ్ఛగా బయట తిరగగలుగుతున్నాడు.

వివేకా హత్య కేసుని సీబీఐకి బదిలీ చేసినప్పటికీ ఏపీలో వారు దర్యాప్తు చేయగల పరిస్థితులు లేనందున ఈ కేసుని తెలంగాణకి బదిలీ చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీతారెడ్డి అభ్యర్ధన మేరకు సుప్రీంకోర్టు ఈ కేసు విచారణని తెలంగాణకి బదిలీ చేసింది. అయినా గంగిరెడ్డిని ఇంతవరకు సీబీఐ అధికారులు అరెస్ట్ చేయలేకపోయారు. చివరికి వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించినా అక్కడా గంగిరెడ్డి బెయిల్‌ రద్దు కాలేదు. ఈ కేసు తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేయడంతో మళ్ళీ దాని కోసం పోరాటం చేయకతప్పడం లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడినే అరెస్ట్ చేయలేనప్పుడు ఇక ఈ కేసు ఎప్పటికీ పరిష్కారం అవుతుందనే సందేహాలు వ్యక్తం అవుతుండటం సహజమే కదా?