ys vivekananda reddy murder case shifted to other statesసిఎం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటికీ న్యాయం జరిగే అవకాశం లేదు కనుక ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేక కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఆమె న్యాయవాదుల వాదనలు, సీబీఐ వాదనలు, నిందితులు శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి తరపు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత ఎల్లుండి శుక్రవారం దీనిపై సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది.

సునీతా రెడ్డి తరపు వాదించిన న్యాయవాది ఏమన్నారంటే, ఈ కేసు విచారణ జరపకుండా సీబీఐ అధికారులకు స్థానిక ఎంపీ అడ్డుపడుతున్నారు. అనారోగ్యం పేరుతో బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులు సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు. ఈ కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపైనే నిందితులు ఎదురుకేసులు బనాయిస్తూ వారినీ ఒత్తిడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో సస్పెండ్ అయిన ఓ సీఐ కొన్ని నెలలకే పదోన్నతి పొంది కేసును తారుమారు చేసేవిదంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు నిందితులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ కేసులో అప్రూవరుగా మారిన వ్యక్తికి ప్రాణభయం ఉందని భయపడుతున్నాడు. కనుక ఇటువంటి పరిస్థితులలో హత్యకావింపబడిన వివేకానందరెడ్డికి ఎన్నటికీ న్యాయం జరుగదు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేసు విచారణ నిర్భయంగా, నిష్పక్షపాతంగా జరపడం సాధ్యం కాదు. కనుక వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు.

సునీత రెడ్డి న్యాయవాది వాదనలతో తాము కూడా పూర్తిగా ఏకీభవిస్తున్నామని సీబీఐ న్యాయవాది తెలిపారు. ఈ కేసు విచారణను బెంగళూరుకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పోలీసులు సహకరించకపోవడం వలననే తాము ఈ కేసును వేగంగా విచారణ చేయలేకపోతున్నామని కనుక ఈ కేసును బెంగళూరుకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ సునీతా రెడ్డి న్యాయవాది, నిందితుల న్యాయవాది ఈ కేసును హైదరాబాద్‌కు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని సీబీఐ అధికారులపై నిందితులు కేసులు పెట్టడం, సాక్షులకు గన్‌మెన్‌లతో భద్రత కల్పించడం, నిందితులు అనుమానాస్పద స్థితిలో చనిపోతుండటం తదితర అంశాలపై ప్రశ్నించి తదుపరి విచారణకు పూర్తి వివరాలతో హాజరుకావాలని ఆదేశించింది. వివేకానంద రెడ్డిని కాక ఈ కేసును కూడా వైసీపీ ప్రభుత్వం చంపేస్తున్నట్లుంది. అందుకే వరుసకు తన సోదరుడే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సునీత రెడ్డి ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్‌ వేయవలసివచ్చింది.