YS Vivekananda Reddy -murderమాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్‌ జగన్‌ చిన్నాన్న అయిన వివేకానందరెడ్డి తొలుత గుండెపోటుతో మరణించారని చెప్పినా ఆ తరువాత పీఏ, కుటుంబసభ్యుల కంప్లయింట్ తో అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొంత కాలంగా కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీనితో ఇది కుటుంబంలోని వారి పనే అని పులివెందులలో పుకార్లు వ్యాపిస్తున్నాయి.

అటువంటి పాత్ర ఏదైనా తేలితే అది వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉంది. యధావిధిగా వైకాపా నాయకులు ప్రభుత్వంపై నిందారోపణలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు సానుభూతి వచ్చేలా అధికార పక్షం ఇటువంటి చర్యలకు ఉపక్రమించదు అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. దీనితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చెయ్యమని ఆదేశించారు.

ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ సిట్‌ ఏర్పాటైంది. ఈ కేసును విశ్లేషించేందుకు ఫోరెన్సిక్‌ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామని, ఘటనాస్థలిని క్లూస్‌టీం, డాగ్‌స్వ్కాడ్‌ క్షుణ్ణంగా పరిశీలించిందని పోలీసులు తెలిపారు. విచారణలో ఎవరి పాత్ర ఉన్నట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఎన్నికలలోపు ఈ హత్య కేసు మిస్టరీ వీడి ఇందులో అటు అధికార పక్ష పాత్రగానీ, ఇటు కుటుంబ పాత్రగానీ ఉన్నట్టు తేలితే అది ఎన్నికలపై పెనుప్రభావమే చూపించే అవకాశం కనిపిస్తుంది.