YS-Vivekananda-Reddy-House-Watchman-Health-Conditionఏపీలో వైసీపీ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో వికెట్ పడిపోబోతోందా?అంటే అవుననే అనుమానం కలుగుతోంది. ఈ కేసుకు సంబందించి ఇప్పటికే కల్లూరి గంగాధర్ రెడ్డి అనుమానాస్పద పరిస్థితులలో మరణించారు. ఈ కేసులో అప్రూవరుగా మారిన నిందితుడు దస్తగిరి తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని పదేపదే చెపుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ కేసులో కీలకసాక్షిగా ఉన్న వివేకా ఇంటి వాచ్ మ్యాన్ రంగన్న ఆరోగ్యం హటాత్తుగా క్షీణించింది. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబందిత సమస్యలతో బాధపడుతున్న రంగన్న ఆరోగ్యం మంగళవారం సాయంత్రం క్షీణించడంతో, పోలీసులు హుటాహుటిన పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వారు రంగన్నను మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్‌కు అంబులెన్సులో తీసుకువెళ్ళారు.

వివేకా హత్య జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి రంగన్నే. ఆ సమయంలో ఆయన అక్కడే ఉన్నాడు. కనుక హత్యకు ముందు, ఆ తర్వాత వివేకా ఇంటికి ఎవరెవరు వచ్చారో ఆయనకు తెలుసు. కనుక ఈ కేసులో హంతకులను కనుగొనడానికి ఆయన సాక్ష్యం చాలా కీలకమైనది. అటువంటి కీలకమైన సాక్షి ఆరోగ్యం హటాత్తుగా క్షీణించింది! ఈ కేసును సీబీఐ పరిష్కరించేలోగా సాక్షులు ఎవరైనా మిగులుతారా?అనే సందేహం కలుగుతోంది.

ఈ కేసులో నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి ఆయనను వెనకేసుకు వస్తున వైసీపీ నేతలు సీబీఐని తప్పుపడుతున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయకుండా జాప్యం చేస్తున్నందుకు ప్రతిపక్షాలు కూడా సీబీఐని అనుమానిస్తుండటం విశేషం. ఈ కేసులో సీబీఐ తనను బలిపశువుని చేసేందుకు ప్రయత్నిస్తోందని అవినాష్ రెడ్డి ఆరోపిస్తుంటే, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేసిన సీబీఐ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు? సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు రెండూ కూడా ఆయనను అరెస్ట్‌ చేసుకోవచ్చని స్పష్టం చేసినప్పటికీ సీబీఐ ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోయింది? విచారణ పేరిట సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయకుండా ఎందుకు కాపాడుతోంది? అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయకుండా సీబీఐపై ఎవరు ఒత్తిడి చేస్తున్నారు?అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్యం క్షీణిస్తుండటంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.