YS Vivekananda Reddy Daughter Sunitha Reddy suspects arrests in familyనిన్న వైఎస్ వివేకా మర్డర్ కేసులో గత 24 గంటలలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివేకా మృతి సున్నితమైన అంశమైనందున ఎన్నికలు జరుగుతున్న వేళ.. కేసు వివరాలను మీడియాకు వెల్లడించకుండా ఆదేశించాలనీ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏపీ హైకోర్టును అభ్యర్థించారు. వివేకా భార్య సౌభాగ్య తో కూడా ఒక పిటిషన్ వేయించారు. అన్ని పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా జగన్ మాత్రం నిన్న ప్రచారం మానేసి లోటస్ పాండ్ కే పరిమితం అయ్యారు.

కేసుకు సంబంధించిన అంశాలను తదుపరి విచారణ వరకు మీడియాకు వెల్లడించకుండా ఆదేశించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. రెండో పరిణామం… మంగళవారం పొద్దు పోయాకా వివేకా కేసును పర్యవేక్షిస్తున్న కడప ఎస్పీని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. మూడో పరిణామం ఈరోజు ఉదయం వివేకా కుమార్తె సునీత మరో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై ఎప్పటిలానే విమర్శలు చేసింది. ఇదే క్రమంలో ఆవిడ చేసిన ఒక వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షించింది.

“మా తండ్రి వివేకా హత్య కేసులో రేపు మా కుటుంబ సభ్యులను అరెస్టు చేసే అవకాశం ఉంది అందుకే హైకోర్టులో పిటీషన్ వేశాం,” అని ఆమె చెప్పుకొచ్చారు. దీని బట్టి గత 24 గంటలలో జరిగిన పరిణామాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబసభ్యులను కాపాడుకోవడానికే కోర్టు ద్వారా విచారణను అడ్డుకునే ప్రయత్నం చేశారా? జగన్ కు సాయపడటానికే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా విచారణ అధికారిని బదిలీ చేసిందా? ఏపీ నిఘా విభాగాధిపతి సహా ఇద్దరు ఎస్పీలను బదిలీపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. వారి బదిలీని సవాల్‌ చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది.