YS Vivekananda Reddy CBI investigationసిబిఐ అతి తొందరలో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ మొదలుపెట్టబోతుందని సమాచారం. కడప జిల్లాలోని పులివెందులలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గత ఏడాది మార్చి 15 తేదీ అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యారు. ఆ సంఘటన తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

అప్పట్లో ఆ హత్య వెనుక చంద్రబాబు ఉన్నారని, సిబిఐ విచారణ కావాలని జగన్ డిమాండ్ చేశారు. అయితే హత్య జరిగి 15 నెలలు గడిచాయి కానీ ఆ కేసుకు సంబంధించి ఒక్క అరెస్టు కూడా ఇప్పటివరకూ కాలేదు. అధికారంలోకి వచ్చిన జగన్ సిబిఐ విచారణ అవసరం లేదని హై కోర్టులో ప్రతిపక్షంలో ఉండగా వేసిన పిటీషన్ విరమించుకున్నారు.

అయితే వివేకా కుమార్తె కోర్టుకు వెళ్లి సిబిఐ విచారణ జరిపేలా కోర్టుని ఒప్పించారు. వివేకా హత్యకేసులో అనుమానితులలో చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ వారే ఉండటం గమనార్హం. దీనితో సిబిఐ విచారణ దేనికి దారి తీస్తుంది అని అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి.

కరోనా విజృంభణతో అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అందువల్ల నిన్నమొన్నటివరకు వివేకా హత్యకేసు విచారణ విషయం కూడా మరుగునపడిపోయింది. ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపులు తుది దశకు చేరాయి. దీనితో సిబిఐ ఈ కేసుని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలలో వార్తలు వస్తున్నాయి.