YS Vivekananda Reddy case with many twistsకాకినాడలో సుబ్రహ్మణ్యం అనే ఓ డ్రైవర్ హత్య చేయబడితే నాలుగు రోజులలో పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కానీ ఓ దివంగత ముఖ్యమంత్రికి స్వయాన్న సోదరుడు, మరో ముఖ్యమంత్రికి స్వయాన్న చిన్నాన్న అయిన వైఎస్ వివేకానంద రెడ్డి అతి దారుణంగా హత్య చేయబడి మూడేళ్ళయినా ఇంతవరకు హంతకుడు ఎవరో, ఆయనను ఎందుకు హత్య చేశారో కనిపెట్టలేకపోవడాన్ని ఏమనుకోవాలి?

ఈ కేసులో పోలీసులు అనేకమందిని అరెస్ట్ చేసి లోపల వేశారు. వారిలో కొందరు తమ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ కూడా ఈ కేసును దర్యాప్తు చేసింది. కానీ అదీ ఇంతవరకు ఏమీ తేల్చడం లేదు. అంటే సిబిఐ మీద కూడా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయనుకోవాలా?

తాజాగా ఈ కేసులో మరో అనూహ్య పరిణామం జరిగింది. ఈ కేసులో ఏ-5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్‌పై జైలులో ఉన్నాడు. ఆయనా భార్య తులశమ్మ ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. దానిలో ఆమె వివేకానంద రెడ్డి అల్లుడు రాజశేఖర్, ఆయన బావమరిది శివప్రకాశ్, బీటెక్ రవి, కొమ్మా పరమేశ్వర్, రాజేశ్వర్ రెడ్డి, నీరుగట్టు ప్రసాద్‌లను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించి నిజానిజాలు తెలుసుకోవాలని కోరారు.

ఆమె పిటిషన్‌పై పులివెందుల కోర్టు మంగళవారం విచారణ జరిపి తదుపరి విచారణను ఆగస్ట్ 30కి వాయిదా వేసింది!

రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత చిన్నాన్న హత్య కేసు ఏళ్ళ తరబడి సాగుండటమే విచిత్రం అనుకొంటే మూడేళ్ళ తరువాత కూడా ఇంకా రోజుకో కొత్త పిటిషన్‌ దాఖలవుతుండటం ఇంకా విచిత్రం. ఫిబ్రవరిలో ఓ పిటిషన్‌ దాఖలైతే దానిపై మూడు నెలల తరువాత విచారణ చేపట్టి మరో రెండు నెలలకు తదుపరి విచారణను వాయిదా వేయడం గమనిస్తే ఈ కేసు నత్తనడకన సాగదీస్తున్నట్లు అర్ధమవుతోంది.

ఈ కేసు విచారణలో ఇంత ఆలస్యం జరుగుతుండటం గమనిస్తే, ఈ కేసు దర్యాప్తు ఎన్నటికీ పూర్తికాకుండా అడ్డుకొనేందుకే సూత్రధారులు ఈవిదంగా మాద్యమద్యలో కేసులు వేయిస్తున్నారేమో? వాటితో వివేకానంద రెడ్డిని హత్య కేసును ఏదో విదంగా మరో 20-30 ఏళ్ళు సాగదీసి చివరికి బలమైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును కొట్టివేయించేసి సూత్రధారులు బయటపడాలనుకొంటున్నారా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.