ys vivekananda reddy case Will it take another turnవైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఓ పక్కన పక్కా ఆధారాలతో నిందితులను పట్టుకుంటూ ముందుకు వెళ్తుండగా, వాటిని జగన్ మీడియా కట్టుకధలుగా భావిస్తూ సీబీఐకు వ్యతిరేకంగా కధనాలను ప్రచురితం చేస్తోంది. ఒకప్పుడు సీబీఐ విచారణ కావాలని కోరిన జగనే, నేడు సీబీఐకు వ్యతిరేకంగా భావజాలాన్ని గుప్పించడం వెనుక ఆంతర్యం ఏమిటో సామాన్యులకైతే అర్ధం కాని పరిస్థితి.

సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో… తాజాగా మరో కొత్త వాదనను తెరపైకి తీసుకు వచ్చారు. వివేకా హత్య కేసులో అయిదవ నిందితుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ ఈ నెల 21వ తేదీన పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాష్ రెడ్డి మరియు మరో ఇద్దరిని అనుమానితులుగా పేర్కొన్నారు.

ఇందులో ఉన్న ట్విస్ట్ ఏమిటంటే… వైఎస్ వివేకానంద రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారని, ఆమెకు ఓ కొడుకు కూడా పుట్టారని, ఈ విషయం అందరికి తెలుసని, ఆస్తి గొడవలు, ఆర్ధిక లావాదేవీల నేపధ్యంలోనే ఈ హత్య జరిగిందని, బెంగుళూర్ లో జరిగిన ఓ భూమి సెటిల్మెంట్ లో వచ్చిన 2 కోట్లు రెండో భార్యకు ఇస్తానని వివేకా చెప్పారని, ఈ వ్యవహారంలో వివేకా రెండో భార్యను అల్లుడు పలు సార్లు బెదిరించారని తెలిపింది.

తన భర్తకు, ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని, సీబీఐ అధికారులు ఈ కేసులో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అసలు నిందితులను వదిలేసి తన భర్తను అరెస్ట్ చేసారని పేర్కొంది. ఇది కట్టుకధో లేక నిజమో అన్నది పోలీసులు, కోర్టులు తేలుస్తారు గానీ, నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ చేత ఈ పిటిషన్ ఎవరు దాఖలు చేయించారో, దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్నది హాట్ టాపిక్ గా మారింది.

సీబీఐ పైనే పోరాటం చేసేందుకు తులసమ్మ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, అప్పటికే జగన్ మీడియా సీబీఐకు వ్యతిరేకంగా కధనాలను ప్రసారం చేస్తుండడంతో, వైసీపీ వర్గాలే తులసమ్మ వెనుకుండి ఇదంతా నడిపిస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు చూస్తుంటే, రోజులు గడుస్తున్న కొద్దీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోందన్న సంకేతాలు కనపడుతున్నాయి.