YS Viveka case Avinash Reddy CBIవైఎస్ వివేకా హత్యకేసులో తనని సీబీఐ అరెస్ట్ చేయవద్దని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసి సోమవారం వరకు గడువు సంపాదించుకొన్నారు. కోర్టులో ఆయన తరపు న్యాయవాది, సీబీఐ విచారణ ముగిసిన తర్వాత ఆయన మరో సరికొత్త వాదన మొదలుపెట్టారు. వారికి ఆత్మసాక్షి కూడా వంతపాడుతోంది.

ఇంతకీ వారి కొత్త వాదన ఏమిటంటే, వివేకానంద రెడ్డికి 2006 నుంచి ఓ ముస్లిం మహిళతో అక్రమసంబందం ఉంది. వివేకా 2011లో ఆమెను వివాహం చేసుకొన్నారు. అందుకోసం ఆయన ఇస్లాం మతం స్వీకరించి, తన పేరు షేక్ మహ్మద్ అక్బర్‌గా మార్చుకొన్నారు. వారికి షేక్ షేహన్‌ షా అనే కుమారుడు పుట్టాడు.

వివేకా తన ఆస్తినంతా వారికి రాసి ఇచ్చేశారనే అనుమానంతో ఆయన అల్లుడు, సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చు. వివేకా హత్య జరిగిన తర్వాత ఆయన ఇంట్లో నుంచి ఆ డాక్యుమెంట్ మాయం అయ్యింది. అంటే ఆస్తి కోసమే ఈ హత్య జరిగిన్నట్లు అర్దమవుతోంది. కానీ సీబీఐ ఈ కోణంలో దర్యాప్తు చేయకుండా, టిడిపి ఒత్తిళ్లకు తలొగ్గి ఈ కేసులో తనను దోషిగా నిరూపించేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిఆరోపిస్తున్నారు.

“ఇంతకాలం సునీతా రెడ్డి నాపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా చట్టానికి కట్టుబడి మౌనంగా ఉండిపోయాను. కానీ చేయని నేరానికి ఈ కేసులో నన్ను ఇరికించాలని కుట్ర జరుగుతోందని తెలిసినా ఇంకా చేతులు ముడుచుకొని కూర్చోలేను. అందుకే ఇకపై నేను కూడా ఈ కేసుపై ఎప్పటికప్పుడు స్పందిస్తాను. న్యాయపోరాటం కూడా చేస్తాను,” అని అవినాష్ రెడ్డి చెప్పారు.

ఆస్తి కోసమే సునీతారెడ్డి దంపతులు వివేకాను హత్య చేసి ఉండవచ్చని అవినాష్ రెడ్డి కొత్త విషయం చెపుతున్నారు. ఒకవేళ వారే వివేకాను హత్య చేయించి ఉంటే, సీబీఐ విచారణ కోసం ఎందుకు పట్టుబడతారు?ఏపీలో నత్తనడకలు నడుస్తున్న ఈ కేసు విచారణను అలాగే కొనసాగనీయకుండా ప్రీంకోర్టుని ఆశ్రయించి హైదరాబాద్‌కు మార్పించుకొని కేసు విచారణను ఎందుకు వేగవంతం చేసుకొంటారు?ఒకవేళ వారే దోషులైతే సీబీఐ విచారణలోనో లేదా కోర్టు విచారణలోనో దొరికిపోతే వారే జైలుకి వెళ్ళవలసివస్తుంది కదా? అని ఆలోచిస్తే ఈ హత్యకు సునీతారెడ్డి దంపతులకు ఎటువంటి సంబందమూ లేదని అర్దం అవుతోంది.

అవినాష్ రెడ్డి వాదన ప్రకారం, ఒకవేళ ఇది ఆస్తుల కోసమే జరిగిన హత్యే అయితే మద్యలో టిడిపి ఎందుకు దూరుతుంది?అయినా కేంద్ర ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే సీబీఐ మీద టిడిపి ఒత్తిళ్ళు పనిచేస్తాయా?చేస్తాయనుకొంటే ఈపాటికే వైసీపీలో అందరినీ చంద్రబాబు నాయుడు జైలుకి పంపించేవారు కదా?

అయినా సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తరచూ ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలను కలుస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు కాదు కదా?మరి సీబీఐ విచారణను ఎవరు ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు?అయినా సీబీఐ ఏ సాక్ష్యాధారాలు లేకుండానే ఓ ఎంపీ మీద హత్యానేరం ఆరోపిస్తూ కేసు నడిపించే సాహసం చేయగలదా?అని ప్రశ్నించుకొంటే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వాదనలు ఎంత పేలవంగా ఉన్నాయో అర్దం అవుతోంది.

న్యాయస్థానం శాస్త్రీయ సాక్షాధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొంటుంది. ఆత్మసాక్షి వండివార్చుతున్న కధానాలు, అవినాష్ రెడ్డి చెపుతున్న ఈ పిట్టకధలు, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన క్లీన్ చిట్‌ వంటివన్నీ ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే పనికివస్తాయి. కనుక తాను నిర్ధోషినని నిరూపించుకోవలసిన బాధ్యత అవినాష్ రెడ్డిదే!