YS Vivekananda Reddy accused deathసిఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులలో ఒకడైన కల్లూరి గంగాధర్ రెడ్డి (49) బుదవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అనంతపురం జిల్లాలోని యాడికి గ్రామంలో తన ఇంట్లో నిద్రించిన గగాధర్ రెడ్డి తెల్లవారేసరికి చనిపోయి ఉన్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్ కూడా అక్కడకు చేరుకొని అతని నివాసంలో సాక్ష్యాధారాల కోసం పరిశీలించి కొన్నిటిని సేకరించింది.

కల్లూరి గంగాధర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లాలోని పులివెందుల. సుమారు పదేళ్ళ క్రితం అనంతపురానికి మకాం మార్చి అక్కడే ఉంటున్నాడు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులలో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ముఖ్య అనుచరులలో గంగాధర్ రెడ్డి కూడా ఒకరు.

“వివేకానంద రెడ్డిని నేనే హత్య చేశానని పోలీసులకు వాంగ్మూలం ఇస్తే శివశంకర్ రెడ్డి తనకి రూ.10 కోట్లు, వ్యవసాయ భూమి ఇస్తానని చెప్పాడని గంగాధర్ రెడ్డి గత ఏడాది సిబిఐ అధికారులకు చెప్పాడు. కానీ ఆ తరువాత యూ టర్న్ తీసుకొని సిబిఐ అధికారులపైనే అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత తనకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీకి రెండుసార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం.

ఇదే కేసులో అప్రూవర్‌గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి పది రోజుల క్రితమే కడప జిల్లా ఎస్పీ రాంసింగ్‌ను కలిసి తొండూరు మండలానికి చెందిన వైసీపీ నేత పెద్ద గోపాల్ రెడ్డి తనతో గొడవ పెట్టుకొని తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, కొండూరు పోలీసులు కూడా తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశాడు. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, రక్షణ కల్పించాలని ఎస్పీని కోరాడు.

వివేకానంద రెడ్డి స్వయాన్న ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి చిన్నాన అవుతారు. అటువంటి ముఖ్యమైన వ్యక్తి హత్యచేయబడితే ఇంతవరకు ఆయనను ఎవరు హత్య చేశారో కనిపెట్టలేకపోగా, ఈ కేసులో సాక్షులను కూడా కాపాడలేకపోవడం, వారికి బెదిరింపులు వస్తుండటం, చివరికి అనుమానాస్పద స్థితిలో చనిపోవడాన్ని ఏమనుకోవాలి?