YS Vijayamma to contest elections 20193468 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ ఈరోజు తిరుమలలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆయన కడప వెళ్లనున్నారు. జగన్‌ పులివెందులకు వెళతారు. ఈ నెల 12న ఇడుపులపాయలో వైఎస్‌ సమాధికి నివాళి, ఆ తరువాత పులివెందులలోని చర్చిలో ప్రార్థనలు నిర్వహించి 13 వరకు పులివెందులలోనే గడుపుతారు. ఈ సందర్భంగా ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. మరోవైపు ఈ పర్యటనలో జిల్లా లోని అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ సారి పది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు దక్కించుకుని టీడీపీకి తమ సత్తా ఏమిటో చూపాలని జగన్‌ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. సిట్టింగులందరూ తమకు ఈ సీటు గారంటీ అని ధీమాగా ఉన్నా జగన్ నిర్ణయం కోసం చూస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో అధికార పక్షం జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి బలపడినట్లు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. పులివెందులకు కృష్ణా జలాలు, ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో టీడీపీ బలం బాగానే పుంజుకుంది.

ఈ పరిస్థితుల్లో ఉదాసీనత పనికిరాదని జగన్ భావిస్తున్నారట. అవసరమైతే సిట్టింగులను మార్చి గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. మరోపక్క జిల్లాలోని జమ్మలమడుగు నుండి జగన్ తల్లి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయమ్మ ఈసారి పోటీ చేస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. జిల్లాలో ఒక పక్క పులివెందుల నుండి జగన్, మరో పక్క జమ్మలమడుగు నుండి విజయమ్మ పోటీ చేస్తే ఆ ప్రభావం జిల్లా మొత్తం మీద ఉంటుందని జగన్ ఉద్దేశంగా కనిపిస్తుంది.

గత ఎన్నికలలో విశాఖపట్నం పార్లమెంట్ కు విజయమ్మ పోటీ చేసి ఓడిపోయారు. సొంత జిల్లా అయితే గెలుపు పై అనుమానం ఉండదని జగన్ భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తొమ్మిది అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. జమ్మలమడుగు, బద్వేలు వైసీపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, జయరాములు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. వారిని ఓడించాలని జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లే టార్గెట్ గా సాగుతున్నారు.