YS Vijayamma - YS Sharmilaషర్మిల కొత్త పార్టీ పెట్టిన నేపథ్యంలో, అలాగే వివేకా కుమార్తె సునీత చేసిన వ్యాఖ్యల కారణంగా వైఎస్ కుటుంబంలో చీలికలు వచ్చాయని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో అదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఇప్పటికే ఒక బహిరంగ లేఖ విడుదల చేసి నష్టనివారణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా విజయమ్మ ఇంకో అడుగుముందుకు వేసి షర్మిల పార్టీ మొదటి బహిరంగ సభకు హాజరుకానున్నట్టు సమాచారం. కొత్త పార్టీపై ప్రకటన చేసేందుకు ఈ నెల 9న ఖమ్మంలో లక్షమందితో భారీ బహిరంగ సభకు వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల బహిరంగ సభకు ఆమె తల్లి విజయమ్మ హాజరుకానున్నారని సమాచారం.

తల్లిని పక్కన పెట్టుకుని పార్టీ ప్రకటన చేయాలని షర్మిల భావిస్తున్నారు. తన పార్టీకి తన తల్లి విజయమ్మ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే షర్మిల ప్రకటించారు. ఇప్పటికే ఈ సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతుండగా.. తెలంగాణతో పాటు ఏపీ నుంచి కూడా భారీగా వైఎస్ అభిమానులు, షర్మిల అభిమానులు వచ్చే అవకాశముంది.

సభా వేదికపై 100 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లి వస్తేనే తెలంగాణలో వైఎస్ అభిమానులలో కదలిక వస్తుందని షర్మిల భావిస్తున్నారట. జగన్ ఆ పార్టీకి దూరంగా ఉంటూనే తల్లిని పంపించడంతో కుటుంబంలో ఎటువంటి చీలిక లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.