YS-Vijayamma

మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్ షర్మిలని కారుతో సహా పోలీసులు క్రేన్ సాయంతో పోలీస్ స్టేషన్‌కి తరలించి ఆమెపై కేసు నమోదు చేసిన విషయం తెలుసుకొన్న ఆమె తల్లి విజయమ్మ కూతురిని పరామర్శించడానికి బయలుదేరబోతే పోలీసులు గృహనిర్బందం చేసి అడ్డుకొన్నారు. అందుకు ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అది సహజమే. ఈ సందర్భంగా విలేఖరులు ఆమెను “ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మీ కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా?ఓసారి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడొచ్చు కదా?” అని ప్రశ్నించినప్పుడు విజయమ్మ ఊహించని సమాధానం చెప్పారు. “ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకేమిటి సంబందం?” అని ఎదురు ప్రశ్నించారు.

ఒకప్పుడు తన కొడుకుని దీవించి గెలిపించమని విజయమ్మ స్వయంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పుడు ఆమే నా కొడుకుతో, ఆ రాష్ట్రంతో నాకు సంబందమే లేదని చెపుతున్నారు. దీనిని బట్టి ఆమె కొడుకు తీరు పట్ల ఎంత మనోవేదన అనుభవిస్తున్నారో గ్రహించవచ్చు. మొదట చెల్లి వైఎస్ షర్మిల అన్నతో విబేదించి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయి సొంతకుంపటి పెట్టుకొన్నారు. ఆ తర్వాత ఈ ఏడాది జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాలలో విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షపదవికి రాజీనామా చేసి కూతురు వద్దకు వెళ్ళిపోయారు. వివేకా కుమార్తె సునీత రెడ్డి కూడా వరుసకు సోదరుడైన సిఎం జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదని తండ్రి హత్య కేసును తెలంగాణకి బదిలీ చేయించుకొన్నారు. సొంత తల్లి, చెల్లెళ్ళను పట్టించుకోని వ్యక్తి రాష్ట్రంలో ప్రతీ అక్కలు, చెల్లెళ్ళు, వదినలు, అవ్వలకు మేలు చేసేందుకు పరితపించి పోతున్నానని చెపుతుండటంతో ప్రతిపక్షాలు ఆయనతో సోషల్ మీడియాలో ఆడుకొంటున్నాయని చెప్పవచ్చు.

వరంగల్‌లో చెల్లెలు వైఎస్ షర్మిలపై టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి ఆమె వాహనానికి నిప్పు పెట్టినప్పుడు, నిన్న ఆమెను కారుతో సహా క్రేన్ సాయంతో పోలీస్ స్టేషన్‌కి తరలిస్తున్నప్పుడు, తల్లిని పోలీసులు గృహనిర్బందం చేసినప్పుడు సిఎం జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు. కనీసం స్పందించనేలేదు. ఏ వ్యక్తి కూడా తల్లికి, సొంత చెల్లెలుకి ఇంత కష్టం వస్తే స్పందించకుండా ఉండడు. కానీ జగనన్న మాత్రం స్పందించలేదు. అందుకే విజయమ్మ కొడుకుతో, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో కూడా సంబందం లేదనేశారనుకోవచ్చు.