YS Vijayamma requests in public meeting give one chance to YS Sharmilaసిఎం జగన్మోహన్ రెడ్డి తాను ‘మాట తప్పను మడమ తిప్పను’ అని చాలాసార్లే చెప్పారు… తప్పారు.. తిప్పారు కూడా! అప్పుడు ఆయనకి తల్లి విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిల ఇద్దరూ కూడా వత్తాసు పలికారు. కానీ చివరికి వారిద్దరూ ఆయనను విడిచిపెట్టి తెలంగాణకు వెళ్ళిపోయారు. అది వేరే సంగతి!

ఇప్పుడు వైఎస్ షర్మిలకి తోడుగా ఉంటున్న విజయమ్మ ఆమె తరపున తెలంగాణ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఈరోజు ఆమె తన కూతురి పాదయాత్ర సభలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నా కూతురు షర్మిల ఒకసారి ఎవరికైనా మాట ఇస్తే మాట తప్పదు. మడమ తిప్పదు. ఆమె రాజన్న బిడ్డ. రాజన్న రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. ఆమె మీ అందరికీ మేలు చేయాలనే ఉద్దేశ్యంతో మీ ముందుకు వచ్చింది. కనుక తెలంగాణ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే నా కూతురికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. ఆమె అడుగులో అడుగు వేస్తూ చేతిలో చేయి వేస్తూ ఆమె వెంట నడవండి. నా కూతురు షర్మిలకి ఆ దేవుడి ఆశీసులు, మీ అందరి ఆశీసులు కావాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.

ఆనాడు విజయమ్మ తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఇలాగే చెప్పారు. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. చివరికి ఆమెనే పార్టీ నుంచి బయటకు సాగనంపారు. ఇప్పుడు తన కుమార్తె కూడా మాట తప్పదు… మడమ తిప్పదని విజయమ్మ సర్టిఫికేట్ ఇచ్చేశారు. కనుక ఆమెకి కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రజలకు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. తల్లి ప్రేమతో ఆమె ఈవిదంగా మాట్లాడినప్పటికీ అసలు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారో… ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో నేటికీ ప్రశ్నార్ధకమే.

తెలంగాణలో కేసీఆర్‌ని, టిఆర్ఎస్‌ను ఢీ కొనడానికి కొండంత బలం ఉన్న బిజెపి, తెలంగాణలో పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ముప్పతిప్పలు పడుతున్నాయి. తెలంగాణ కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరామ్ వంటి వారిని కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం లేదు. మరి ఆంధ్రాకు చెందిన వైఎస్ షర్మిల అన్నతో విభేధించి తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తూ కేసీఆర్‌ని తిట్టిపోస్తే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌, బిజెపిలను కాదని ఆమెకు ఓట్లు వేస్తారా?

నిజానికి రాష్ట్రం విడిపోయినప్పుడే తెలంగాణలో రాజన్న సెంటిమెంట్ చచ్చిపోయి దాని స్థానంలో తెలంగాణ సెంటిమెంట్ బలపడింది. అయినా విజయమ్మ, షర్మిల ఇద్దరూ వైఎస్ సెంటిమెంటుతో తెలంగాణలో బలపడుదామనుకోవడం రాజకీయ అజ్ఞానమా లేక మరేదైనా రాజకీయ వ్యూహం ఉందా? అనే సందేహం కలుగుతుంది. తెలంగాణలో పాదయాత్ర చేస్తూ వైఎస్ షర్మిల తన పార్టీని బలోపేతం చేయాలనుకొంటున్నారేమో కానీ నిజానికి ఆమె అందరి దృష్టిలో తనను తాను తగ్గించుకొంటున్నారని చెప్పవచ్చు.