YS Sunithaఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, వివేకా సోదరుడు సుధాకర్ రెడ్డి పులివెందులలో ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సునీతా రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ, “నా తండ్రి హత్యకు గురైతే అది ఎవరు చేశారో కూడా తెలుసుకోలేనంత అమాయకురాలిని కాను. అయితే ఈ కుట్రకు పాల్పడినవారే తిరిగి నా కుటుంబం మీద నేరారోపణలు చేస్తుండటం చాలా బాధ కలిగిస్తోంది. ఈ హత్యపై విచారణ కోసం నేను పట్టుబట్టినప్పుడు చాలా మంది నన్ను నిరుత్సాహపరిచారు. ఇక్కడితో ఈ విషయం మరిచిపోతే మంచిదని సూచించారు. కానీ నా తండ్రి హత్య చేయబడిన్నట్లు కడపలో మరో హత్య జరగకూడదనే నేను పట్టుదలగా న్యాయపోరాటం చేస్తున్నాను.

సీబీఐ అధికారులనే బెదిరించి వారిపై కేసులు వేయించగల సమర్ధులు వారు. ఈ కేసు విచారణ హైదరాబాద్‌కు బదిలీ అయినప్పటి నుంచి దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా విచారణ చేయగలుగుతున్నాయి. కనుక త్వరలోనే నా తండ్రి హంతకులు, వారికి సాయపడినవారందరూ శిక్షింపబడుతారని నేను నమ్ముతున్నాను. నా తండ్రి హత్యకు సంబందించి నాకు తెలిసిన అన్ని విషయాలు సీబీఐకు చెపుతాను. నేరస్తులకు శిక్ష పడేలా చేయడమే నా ఏకైక లక్ష్యం,” అని అన్నారు.

వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడుగా సీబీఐ పేర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని మంగళవారం సీబీఐ నాలుగు గంటలసేపు ప్రశ్నించింది. ఆయనని అరెస్ట్ చేయాలని సీబీఐ భావిస్తున్నప్పటికీ తెలంగాణ హైకోర్టు ఆదేశాల కారణంగా అరెస్ట్ చేయలేకపోతోంది. హైకోర్టు తీర్పు వెలువడితే సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయమే అని భావించవచ్చు.