YS-Sharmila-YSR-Telangana-Partyసిఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నతో విభేదించి తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనే సొంత కుంపటి పెట్టుకొని పాదయాత్రలు చేస్తున్నారు. ఇన్ని నెలలుగా పాదయాత్రలు చేస్తున్నా రాని గుర్తింపు, టిఆర్ఎస్‌ నేతల ఎదురుదాడితో కేవలం రెండు మూడు రోజులలో వచ్చేసింది. టిఆర్ఎస్‌ నేతలకు సిఎం కేసీఆర్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లున్నారు. ఇంతకాలం ఆమె ఎన్ని మాటలన్నా పట్టించుకోని వారందరూ ఇప్పుడు మూకుమ్మడిగా ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక్కడ వైసీపీకి ‘సాక్షి మీడియా’ ఎటువంటిదో అక్కడ తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వానికి ‘నమస్తే తెలంగాణ’ మీడియా కూడా అటువంటిదే. దానికీ కేసీఆర్‌ నుంచి గ్రీన్ సిగ్నల్‌ వచ్చేసినట్లుంది. తొలిసారిగా దానిలో ఈరోజు సంచికలో “ఎక్కడి మూకలు… ఎక్కడి మైకులు!” అనే శీర్షికతో వైఎస్ కుటుంబంపై నిప్పులు చెరుగుతూ చాలా పెద్ద కధనమే ప్రచురించింది.

ఒకప్పుడు తెలంగాణ భాషని, యాసని, ప్రజలను, సంస్కృతిని ఈసడించుకొన్న వైఎస్ షర్మిల, అన్నతో ఆస్తులు, పదవుల పంపకాలలో తేడా వచ్చి అక్కడ పోగొట్టుకొన్నది ఇక్కడ సంపాదించుకోవాలనే తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్నారు. అసలు ఏనాడైనా ఆమె తెలంగాణ కోసం పోరాడరా? తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చారా? మరి తెలంగాణలో ఆమెకేమి పని?

తిరిగితే తిరిగారు… ‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా తాగుబోతులే… మద్యం దుకాణాలే’ అని తెలంగాణ ప్రజలని, ప్రభుత్వాన్ని అవహేళన చేస్తున్నారామె. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎంతో అభివృద్ధి చేస్తున్న సిఎం కేసీఆర్‌ని రాష్ట్ర ప్రజలందరూ గౌరవిస్తుంటే, ఆమె మాత్రం ఆయనని నోటికొచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. ఉద్యమ పార్టీ అయిన టిఆర్ఎస్‌ని తాలిబన్లతో, కేసీఆర్‌ని వారి నాయకుడిగా అభివర్ణిస్తున్నారు. ఈవిదంగా నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతూ నేను మహిళని నన్ను గౌరవించాలని ఆమె ఆశిస్తున్నారు.

ఆమె తండ్రి రాజశేఖర్ రెడ్డి, అన్న జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించారు. వైఎస్ కుటుంబం తెలంగాణ ద్రోహుల కుటుంబం. తెలంగాణని, ప్రజలని దోచుకొన్న కుటుంబం. వైఎస్ హయాంలో జరిగిన భూదోపిడీ, రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన సూట్ కేసు కంపెనీలు, వాటి క్విడ్ ప్రో కేసులలో అనేక మంది ఐఏఎస్ అధికారులు జైళ్లకి వెళ్ళివచ్చారు. నేటికీ ఆ కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రులు, అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

వైఎస్ హయాంలోనే హైదరాబాద్‌ నగరానికి ఫ్యాక్షన్ హత్యలు విస్తరించిన సంగతి మరిచిపోయారా? జైళ్ళలో ఉన్న సాక్షులే హత్యలు చేయబడిన సంగతి అందరికీ తెలుసు. జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చి లక్షల కోట్లు దోచుకొన్నది వైఎస్ కుటుంబం కాదా? వోక్స్ వ్యాగన్ కంపెనీని లంచాల కోసం పీడించి పారద్రోలింది మీరు కాదా? సముద్ర తీరాలను కూడా అమ్మేసుకొన్న మీరా తెలంగాణని ఉద్దరిస్తారు?

ఆమె తండ్రి తెలంగాణని పాకిస్తాన్ అంటే ఈమె ఆఫ్ఘనిస్తాన్ అంటోంది. మరి అటువంటప్పుడు అనువుగాని చోట తిరగడం ఎందుకు?తనకి సంబందం లేనివారితో కొట్లాడటం ఎందుకు?ఈ నాటకం అంతా ఎవరి కోసం?బిజేపీ కోసమేనా? తెలంగాణ రాష్ట్రం గురించి ఆమె నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుంటే ఖండించని బిజెపి నేతలు ఇప్పుడు ఆమెకు దేనికి మద్దతు పలుకుతున్నారు?ఆమె గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేయగానే గవర్నర్‌ వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని ఏమనుకోవాలి? అంటే వైఎస్ షర్మిల వెనుక ఎవరున్నారో అర్దం అవుతోంది కదా? అంటూ ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వైఎస్ షర్మిలని, వైఎస్ కుటుంబాన్ని దూది ఏకినట్లు ఏకి పారేసింది. పొరుగు రాష్ట్రానికి వెళ్ళి వారితో తన కుటుంబం గురించి ఇటువంటి మాటలు అనిపించుకోవడం సిగ్గుచేటు. ఈ విమర్శలు, ఆరోపణలు చూసి పైనున్న వైఎస్సార్ ఆత్మ ఎంత గోషిస్తుందో?