YS Sharmila - YS -Vijayammaఒకపక్క తమకు పక్క రాష్ట్రంతో సత్సంబంధాలే ముఖ్యం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెబుతూ తెలంగాణలోని షర్మిల పార్టీ తో తమకు సంబంధం లేదని తన వారితో చెబుతూ ఉంటారు.

అయితే ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మాత్రం షర్మిల పార్టీ ప్రతీ కార్యక్రమానికి హాజరవుతారు. ఈరోజు ఆ పార్టీ పేరు ప్రకటన కార్యక్రమంలో కూడా పాల్గొని తెలంగాణ బిడ్డలకు బంగారు భవిష్యత్‌ ఇవ్వడానికి షర్మిల ముందుకొస్తోందన్నారు.

“మాటిస్తే ముందుకెళ్లడం తండ్రి నుంచి షర్మిల నేర్చుకుంది. షర్మిలను మీ కుటుంబంలో ఒకరిగా చూడండి. రాజన్న రాజ్యం తెలంగాణ జన్మహక్కు అని షర్మిల నమ్ముతోంది, తెలంగాణ బిడ్డలకు బంగారు భవిష్యత్‌ ఇవ్వడానికి ముందుకొస్తోంది,” అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఇటీవలే వైఎస్ ని నరరూపరాక్షసుడు, ద్రోహి అన్న తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులకు విజయమ్మ కూడా సమాధానం చెప్పలేకపోవడం విశేషం. వైఎస్‌ అన్ని ప్రాంతాలను సమానంగా చూశారని మాత్రమే చెప్పుకొచ్చారు.

వైఎస్‌ వచ్చాక తుపాకుల మోతలు ఆగిపోయాయని, పల్లె బతికింది… రక్తం కాదు.. నీరు మాత్రమే పారాలని ఆలోచించారు అంటూ రొటీన్ ప్రసంగంతో ముగించారు గానీ చనిపోయిన వైఎస్ ని అనరాని మాటలు అన్న వారికి సమాధానం కూడా చెప్పలేకపోయారు. ఆవిడ కూడా జగన్ లానే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు.