YS_Sharmila_Welfare_Schemesఅలనాడు శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి అన్న పేరుతో పరిపాలన చేశాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్మోహన్ రెడ్డి తన తండ్రిపేరుతో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి పరిపాలిస్తున్నారు. అయితే రామాయణంలో రాముడు తిరిగివచ్చాడు. సంక్షేమ రాజ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరిగిరారు అంతే తేడా. కనుక వెనుక తండ్రి ఫోటో పెట్టుకొని పరిపాలిస్తున్నారు.

ఇక్కడ ఏపీలో అన్నయ్య స్థాపించిన సంక్షేమ రాజ్యంలో చోటు లభించకపోవడంతో వైఎస్ షర్మిల కూడా తండ్రి పేరు, ఫోటో పెట్టుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారు. ఆమె కూడా ప్రజలు తనకు అవకాశం ఇస్తే అన్నలాగే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం స్థాపిస్తానని చెపుతున్నారు!

ప్రజాప్రస్థానం పేరుతో తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేయడంతో ఆయన దమ్ముంటే ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేసి తనపై గెలవాలని సవాల్ విసిరారు.

వైఎస్ షర్మిల ఆ సవాలును స్వీకరించడమే కాక వచ్చే ఎన్నికలలో తాను జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేయబోతున్నట్లు నిన్న ప్రకటించేశారు. నిన్న ఆదివారం పాలేరు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, “ఖమ్మం జిల్లా అంటే వైఎస్సార్. వైఎస్సార్ అంటే ఖమ్మం జిల్లా అని అందరూ భావిస్తుంటారు. జిల్లాకు గుమ్మం వంటి పాలేరు నుంచి పోటీ చేయాలనే కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది. కనుక వచ్చే ఎన్నికలలో ఇక్కడి నుంచే పోటీ చేసి రాష్ట్రంలో మన పార్టీ జెండా ఇక్కడే ఎగురవేస్తాను. ఇక్కడి నుంచే తెలంగాణలో సంక్షేమ రాజ్య స్థాపన జరుగుతుంది,” అని వైఎస్ షర్మిల ప్రకటించారు.

తనపై మంత్రి పువ్వాడ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ “పువ్వాడ మంత్రి కాదు కంత్రి. నాకు, నా కుటుంబానికి బయ్యారం గనుల్లో వాటాలు ఉన్నాయని ఆయన మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ నాకు, నా కుటుంబంలో ఎవరికీ దానిలో వాటాలు లేవు. నా పిల్లల మీద ఒట్టేసి చెపుతున్నాను. మరి మంత్రి పువ్వాడకు ధైర్యం ఉంటే తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని తన బిడ్డలపై ప్రమాణం చేయగలరా?” అని సవాల్ విసిరారు.

“నేను మండే ఎండల్లో పాదయాత్ర చేస్తుంటే క్యాట్ వాక్ చేస్తున్నానని పువ్వాడ నాగురించి చాలా చులకనగా మాట్లాడారు. ఆయనకు దమ్ముంటే నాతో నాలుగు రోజులు క్యాట్ వాక్ చేయలని సవాల్ విసురుతున్నాను,” అని వైఎస్ షర్మిల అన్నారు.