ys-sharmila-to-campaign-for-ysrcp2014 ఎన్నికలలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఓటమి తరువాత వైఎస్ షర్మిళ తెరవెనుకకు వెళ్లిపోయారు. ఎప్పుడో ఒకప్పుడు తప్ప ఆమె మీడియాలో కనిపించింది లేదు. చివరి సారిగా ఆమె రాజకీయాల గురించి మాట్లాడింది హీరో ప్రభాస్ కు తనకూ సంబంధం ఉంది అని ఓ వర్గం ఆన్‌లైన్‌లో దుష్ప్రచారం చేస్తుందని కంప్లయింట్ చేసినప్పుడే. అప్పుడు తన మీద జరిగిన దుష్ప్రచారం వెనుక చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నారని ఆమె ఆరోపించారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఆమె ను తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి .

గుంటూరు నుండి ఇచ్ఛాపురం వరకు ఆమె కొన్ని రోడ్ షోలలో పాల్గొంటారని సమాచారం. దీనికి సంబంధించిన షెడ్యూల్ 2-3 రోజులలో సిద్ధం అవుతుందట. అన్న ఒక వైపు చెల్లెలు ఒక వైపు పంచుకుని ప్రచారం చెయ్యబోతున్నారు. ఇప్పటికే అన్ని ఎమ్మెల్యే స్థానాలకు, ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి జగన్ ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల లాగానే ఈ సారి కూడా షర్మిళ పోటీ చేస్తారని వదంతులు వినపడినా అది జరగలేదు. 2014లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ కూడా ఈ సారి పోటీలో లేరు.

2014 ఎన్నికలకు ముందు జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీని ముందుకు నడిపించింది షర్మిళ. పాదయాత్ర చేసి పార్టీని ప్రజలలోకి తీసుకుని వెళ్లారు. రాజన్న కూతురిని, జగనన్న చెల్లల్ని అంటూ దూసుకుపోయారు. ఇప్పుడు ఆవిడ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓటింగు వచ్చే నెల 11న జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్య అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక వేళ ఓడిపోతే కొత్తగా పెట్టిన ఒక ప్రాంతీయ పార్టీ రెండు పర్యాయాలు వరుసగా ప్రతిపక్షంలో మనగలగడం అసంభవం.