YS Sharmila Telangana Rightsఏపీలో జగనన్నతో విభేధించి తెలంగాణ రాజకీయాలలో నాటకీయంగా ప్రవేశించిన వైఎస్ షర్మిల, రెండేళ్ళుగా పాదయాత్రలు, నిరసనదీక్షలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం బిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మద్యే ఊగిసలాడుతుండటం ఆమెకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. కనుక ఆమె కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్దపడుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణపై సర్వ హక్కులు నాకే ఉన్నాయని ఆమె చెప్పుకోవడం విశేషం.

ఈరోజు ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ తన పార్టీ పేరులో తెలంగాణను వదిలేసుకొని బిఆర్ఎస్‌గా మార్చేసుకొన్నారు. తెలంగాణ విడిచిపెట్టి జాతీయరాజకీయాలలోకి వెళ్ళిపోతున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు చేసిందేమీ లేదు. కనుక వాటికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు. కనుక రాష్ట్రంలో తెలంగాణ అనే పేరు కలిగిన ఏకైక పార్టీ మా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ మాత్రమే. మేము మాత్రమే తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నాము. కనుక మాకు, మా పార్టీ అధ్యక్షురాలైన నాకు మాత్రమే తెలంగాణ గురించి మాట్లాడే సర్వహక్కులు ఉన్నాయి,” అని అన్నారు.

ఇదివరకు ఆమె “నేను జగనన్న వదిలిన బాణాన్ని” అంటూ తెలంగాణలో పాదయాత్రలు చేశారు. ఇప్పుడు “వైఎస్సార్ బిడ్డ”నని చెప్పుకొని తిరుగుతున్నారు. రేపు కాంగ్రెస్‌తో చేతులు కలిపితే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు రైట్ హ్యాండ్ నేనే అని చెపుకొంటారేమో?అది వేరే విషయం. కానీ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఏరియాలు వారీగా సినిమా హక్కులు కొనుకొన్నట్లు వైఎస్ షర్మిల కూడా తెలంగాణ హక్కులు తనవే అని చెప్పుకోవడం విడ్డూరంగానే ఉంది.

ఆనాడు జగనన్న కూడా తెలంగాణలో ఓదార్పుయాత్రలు చేసి వైసీపీని బలోపేతం చేసుకొన్నారు. తెలంగాణ సెంటిమెంటుని గౌరవిస్తానని చెప్పారు. కానీ రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవగానే ‘జై సమైక్యాంద్రా’ అంటూ తెలంగాణలో తనను నమ్ముకొన్న కొండా సురేఖ వంటి అనేక మంది సీనియర్ నేతలను రోడ్డున పడేసి ఏపీకి వచ్చేశారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వారందరూ జగనన్నను నమ్ముకొని తెలంగాణ ఉద్యమాలకు దూరంగా ఉండిపోవడం, ఆయన తమకి హ్యాండ్ ఇచ్చి ఏపీకి వెళ్ళిపోవడంతో వారు రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తిన్నారు. కనుక ఇప్పుడు ఎవరి బాణమో తెలియని వైఎస్ షర్మిలను ఎవరైనా ఎందుకు నమ్మాలి?

వైఎస్ షర్మిలకు తెలంగాణలో ఏమాత్రం ప్రజాధారణ లభించనప్పటికీ తనని తాను కేసీఆర్‌తో సమానమని, తన పార్టీ బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపిలతో సమానమని ఊహించుకొంటూ ఏదేదో మాట్లాడేస్తుంటారు. ఇదీ అటువంటిదే అని సరిపెట్టుకోక తప్పదు.