YS-Sharmila-Padayatraదాదాపు ఏడాదిగా వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నప్పటికీ లభించని గుర్తింపు గత రెండు మూడు రోజులుగా జరిగిన ఘటనలతో లభించింది. ఆమెపై టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే అనుచరుల దాడిని ఖండించాల్సిందే. సాధారణంగా రాజకీయ ప్రత్యర్ధులపై అధికార పార్టీ నేతల అనుచరులు భౌతిక దాడులు చేయడమంటే అభద్రతాభావానికి నిదర్శనంగా భావించవచ్చు.

కానీ వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్రలు చేస్తూ, కేసీఆర్‌ మీద, టిఆర్ఎస్‌ ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలతో టిఆర్ఎస్‌కి రాజకీయంగా ఎటువంటి నష్టం లేదని అందరికీ తెలుసు. అందుకే బిజెపి, కాంగ్రెస్‌ నేతల పాదయాత్రలకు అనుమతించని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ షర్మిల పాదయాత్రను ఎన్నడూ అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. ఇంతకాలం ఆమె తమ అధినేతపై, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా టిఆర్ఎస్‌లో ఎవరూ పట్టించుకోలేదని చెప్పవచ్చు.

కానీ ఇప్పుడు ఆమె పాదయాత్రని అడ్డుకొంటున్నారు. భౌతికదాడులు కూడా చేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? అంటే వైఎస్ షర్మిల హడావుడి మరింత ఎక్కువ అవుతుంది. నిన్న హైదరాబాద్‌లో చేసిన హడావుడే ఇందుకు నిదర్శనం. ఆమె హడావుడి పెరిగితే బండి సంజయ్‌ పాదయాత్రకి దక్కాల్సిన మీడియా ఫోకస్ ఆమెకే దక్కుతుందని నిన్న రుజువు అయ్యింది.

వైఎస్ షర్మిల పాదయాత్రలో సిఎం కేసీఆర్‌ని, టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించవద్దనే షరతులతో హైకోర్టుకి ఆమె పాదయాత్రకి అనుమతించింది. కానీ కేసీఆర్‌ని, టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించకుండా పాదయాత్ర చేయాల్సివస్తే దాని కంటే హాయిగా ఇంట్లో కూర్చోవడం మేలు. అయినా ఆమె వేరే ఏం మాట్లాడగలరు? ఒకవేళ ఆమె కాంగ్రెస్‌, బిజెపి, కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడినా ఏం ప్రయోజనం?

కనుక ఆమె మళ్ళీ కేసీఆర్‌ని, టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడం ఖాయం. అప్పుడు టిఆర్ఎస్‌ శ్రేణులు ఆమెను అడ్డుకోవడం కూడా ఖాయమే. అప్పుడు మళ్ళీ ఇలాగే హడావుడి చేస్తారు. అంటే బండి సంజయ్‌ పాదయాత్రని ఆమె ద్వారా కేసీఆర్‌ హైజాక్ చేస్తున్నట్లు భావించవచ్చు. కనుక వైఎస్ షర్మిల కేసీఆర్‌ వదిలిన బాణమనుకోవాలేమో?బహుశః అందుకే ఆమె సోదరుడు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, ఏపీ మంత్రులు ఎవరూ కూడా ఆమెపై దాడిని ఖండించలేదేమో?

వైఎస్ షర్మిల ఒకప్పుడు తాను జగనన్న వదిలిన బాణాన్ని అని గర్వంగా చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు జగనన్న పట్టించుకోవడం లేదు కనుక ఆమె తన కోసం కాక వేరెవరి కోసమో గురి తప్పిన బాణంలో అగమ్యంగా దూసుకుపోతున్నట్లున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్‌ని శక్తివంతమైన, జాతీయపార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలే ఓడించలేకపోతున్నాయి. కనుక వైఎస్ షర్మిల ప్రస్థానం, దాని లక్ష్యం వేరే ఏదో ఉంది. బహుశః తెలంగాణలో సెంటిమెంట్ రాజేసిపెడుతూ టిఆర్ఎస్‌కు ఉపయోగపడటమే కావచ్చు.