దేశ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వం కోరుకొంటున్నారని బిఆర్ఎస్ నేతలు చెప్పుకొంటుంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఆయన ఓ నిరంకుశ నిజాం నవాబు, ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే గౌరవం లేదు.. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా పెద్ద పెద్ద భవనాలు కట్టించుకొంటారు… ప్రత్యేక విమానాలేసుకొని దేశాటన చేస్తుంటారంటూ దుమ్మెత్తిపోస్తుంటాయి. కేసీఆర్ దేశాన్ని ఉద్దరించడానికి బయలుదేరుతుంటే రాష్ట్రంలో ఆయనని గద్దె దించక తప్పదని ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో వాదిస్తున్నాయి.
కారణాలు ఏవైతేనేమీ, కేసీఆర్‌కి తెలంగాణ రాష్ట్రంలోనే అనేకమంది రాజకీయ శత్రువులున్నారు. వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. వారిలో వైఎస్ షర్మిల కూడా ఒకరు. ఇక్కడ ఏపీలో జగనన్న పట్టించుకోకపోవడంతో తెలంగాణలో తండ్రి పేరుతో పార్టీ పెట్టుకొని కాళ్ళరిగిపోయేలా పాదయాత్ర చేస్తున్నారు. ఎవరైనా “ఎందుకమ్మా… ఎండనక వాననక అలా తిరుగుతున్నావు?” అని ప్రశ్నిస్తే వారిపై ఆమె నిప్పులు కక్కుతుంటారు. బిఆర్ఎస్ నేతలు కూడా అలాగే ప్రశ్నించడంతో ఆమె కేసీఆర్ మీద భగ్గుమన్నారు.
Also Read – లోకేష్ నేర్చుకున్నారు మరి జగన్?
నిన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌గారు నెత్తి మీద ఓ టోపీ పెట్టుకొని పిట్టలదొరలా కబుర్లు చెపుతుంటారు. ఇక్కడ రాష్ట్రంలో ప్రజల సమస్యలని పట్టించుకోరు కానీ దేశాన్ని ఉద్దరిస్తారట! అసలు ఆయన ఏనాడైనా ప్రజల మద్యకి వెళ్ళి వారితో మాట్లాడితే కదా… వారి సమస్యలు తెలియడానికి?ఎప్పుడూ ప్రత్యేక విమానాలేసుకొని దేశాటన చేస్తుంటారు. ఆయనకి దమ్ముంటే నాతో పాటు పాదయాత్ర చేయాలని సవాలు చేస్తున్నాను.
పాదయాత్ర చేయాలంటే తన వద్ద షూస్ లేవంటారేమో అని ఇవిగో… నేనే మంచి షూస్ కొని ఆయనకి బహుమతిగా పంపిస్తున్నాను. ఒకవేళ ఆ షూస్ సరిపోకపోతే మార్చుకొనేందుకు వాటి బిల్లు కూడా పంపిస్తున్నాను. కేసీఆర్ నాతో కలిసి నాలుగడుగులు పాదయాత్ర చేయగలరా?పాదయాత్ర చేస్తే ప్రజల సమస్యలు ఏమిటో ఆయనకీ అర్దం అవుతాయి,” అని వైఎస్ షర్మిల అన్నారు.
Also Read – ఓ గబ్బర్ సింగ్, ఓ పుష్పరాజ్.. మరిచిపోలేని పాత్రలే!