YS-Jagan-YS-Sharmilaశ్రీరాముడు బాణం సంధిస్తే అది శత్రువులను సంహరించి తిరిగివచ్చి ఆయన అమ్ములపొదిలోకి చేరుకొనేది. అందుకే దానిని రామబాణం అన్నారు. సంధిస్తే గురి తప్పదు… శత్రు సంహారం తప్పదు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రియమైన చెల్లెలు వైఎస్ షర్మిలని తన శత్రువులపై బాణంలా సందించారు. ఆమె స్వయంగా ‘నేను జగనన్న సందించిన బాణాన్ని’ అని గర్వంగా చెప్పుకొనేవారు.

ఇప్పుడు అదే బాణం గురితప్పి వైసీపీ గొంతులోనే గుచ్చుకొంటుండటంతో పార్టీలో నేతలెవరికీ నోరు పెగలటం లేదు. టిడిపి నేతలు ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తప్పు పడితే మంత్రులు అంబటి రాంబాబు, ఆర్‌కె.రోజావంటి వారు వారిపై ఎదురుదాడి చేశారు. కానీ తమ అధినేత చెల్లెలు వైఎస్ షర్మిల పదేపదే ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తప్పుపడుతుంటే మౌనం వహిస్తున్నారు. ఆమెను వారించలేరు… ఆమెపై ఎదురు దాడిచేయలేరు… అలాగని ధైర్యం చేసి ఆమెను సమర్ధించలేరు. వారి మౌనం వారి ద్వందవైఖరికి నిదర్శనం.

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చగానే టిడిపి తర్వాత మొట్టమొదట వైఎస్ షర్మిలే వ్యతిరేకించారు. అదేదో మొక్కుబడిగా కాదని స్పష్టం జేసేందుకు మళ్ళీ నిన్న ఇదే అంశంపై మరోసారి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

వికారాబాద్‌ జిల్లా మోమిన్ పేట మండలంలోని మోరంగపల్లి వద్ద మీడియాతో మాట్లాడుతూ, “ఎవరైనా ఓ గొప్ప వ్యక్తిని గౌరవించుకొనేందుకు ఓ జిల్లా లేదా పట్టణం లేదా ఓ సంస్థకి పేరు పెట్టుకొంటాము. ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీకి కూడా ఆవిదంగానే పెట్టారు. కనుక ఎన్టీఆర్‌ పేరును తొలగించి మా తండ్రిగారి పేరు పెట్టినా అది నాకు సమ్మతం కాదు. ఎందుకంటే అది ఎన్టీఆర్‌ని.. ఆయనను అభిమానించే ప్రజలను కూడా అవమానించినట్లే కనుక.

ఇవాళ్ళ మనం అధికారంలో ఉన్నామని ఇటువంటి పనులు చేస్తే రేపు ఇంకొకరు అధికారంలోకి వచ్చినప్పుడూ అదే చేయవచ్చు కదా?అప్పుడు అవమానపడేది మనమే కదా? ఇటువంటి చర్యలతో ఆ మహనీయులకు ప్రతిష్టకు భంగం కలుగుతుంది కదా?అసలు ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్‌కి ఈయవలసిన అవసరమేమిటి?ఆయనకు ఖ్యాతి లేదనా?రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయనను హృదయాలలో నిలుపుకొని దేవుడిలా పూజిస్తున్నవారు కోకొల్లలు ఉన్నారు కదా?మరింకెందుకు ఈ పేర్లు మార్చడం?” అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.