Ys Sharmila Reacted on Jagan govt about NTR University Name Changeఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుని వైసీపీలో కూడా ఎవరూ గట్టిగా సమర్ధించలేకపోతున్నారు. కానీ పిల్లి మెడలో గంట ఎవరు కడతారన్నట్లు ఒక్క గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనీ వంశీ తప్ప పార్టీలో మరెవరూ ధైర్యం చేసి ‘ఇది సరికాదని’ జగనన్నకు చెప్పలేకపోతున్నారు. ఈ వివాదంపై మొట్టమొదట లక్ష్మీ పార్వతి, జూ.ఎన్టీఆర్‌, నందమూరి కుటుంబ సభ్యులు స్పందిస్తారనుకొంటే వారి కంటే ముందు సిఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల స్పందించడం విశేషం.

ప్రస్తుతం తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న ఆమె వివాదంపై స్పందిస్తూ, “ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదు. ఎన్టీఆర్‌ పేరును పెట్టడం గౌరవం. దానిని తొలగించడం అగౌరవించడమే అవుతుంది. ఇది ఆయనను కాదు… మనల్ని మనమే అవమానించుకొన్నట్లు అవుతుంది. ఈవిదంగా చేయడం యూనివర్సిటీ పేర్లు మార్చుతుండటం వలన వాటి ప్రతిష్ట కూడా దెబ్బ తింటుంది. ఇలా ఒకరి తర్వాత మరొక ప్రభుత్వం పేర్లు మార్చుకొంటూ పోతే చివరికి ఏ పేరు మిగలదు. దీని వలన ప్రజలలో కూడా గందరగోళం ఏర్పడుతుంది. అయినా ఓ యూనివర్సిటీ పేరు మార్చి సాధించేది ఏమిటి? ఏపీ ప్రభుత్వం ఏ కారణంతో ఈ పని చేసినప్పటికీ దానిని నేను ఖండిస్తున్నాను. కనుక ఈ నిర్ణయం ఉపసంహరించుకొంటే మంచిది,” అని అన్నారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని బయటి వ్యక్తులు ఎవరో వ్యతిరేకిస్తే దానికో రాజకీయ కారణం వెతికి వారు దురుదేశ్యంతో ఆవిదంగా మాట్లాడుతున్నారని సమర్ధించుకోవచ్చు. కానీ ఇప్పుడు సొంత చెల్లెలే తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే సిఎం జగన్మోహన్ రెడ్డి ఏమని జవాబు చెప్పగలరు? తన నిర్ణయాన్ని ఏవిదంగా సమర్ధించుకోగలరు?

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేయడంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అభ్యంతరం తెలుపుతూ ఈరోజు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవలసిందిగా జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.