YS Sharmila Sajjala Ramakrishna Reddyఏపీ, తెలంగాణ రాష్ట్రాల పునరేకీకరణని స్వాగతిస్తామంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలపై ఊహించినట్లే తెలంగాణలో టిఆర్ఎస్‌ నేతల నుంచి ఘాటుగా బదులొచ్చింది. అదేమీ విశేషం కాదు కానీ తెలంగాణ రాజకీయాలలో ఉన్న సిఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించడమే విశేషం.

“సజ్జల రామకృష్ణారెడ్డి ఈవిదంగా మాట్లాడటాన్ని నేను ఖండిస్తున్నాను. ఆయన మాటలు తెలంగాణ కోసం జరిగిన పోరాటాలని, బలిదానాలని, ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేవిగా ఉన్నాయి. ఎన్నో వందలమంది బలిదానాలు చేసుకొని పోరాడితే తెలంగాణ ఏర్పడింది. ఈ విషయం సజ్జలకి తెలియదా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చారిత్రిక ఘట్టం. అది చరిత్రలో ఒక్కసారే జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ జరుగదు. రెండు రాష్ట్రాలు విడిపోయి 8 ఏళ్ళవుతోంది. వాటిని తిరిగి ఎలా కలపాలని అనుకొంటున్నారు?ఇప్పుడు మీరు మీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధిపై దృష్టి పెట్టి పనిచేసుకొంటే మంచిది కానీ విడిపోయిన రెండు రాష్ట్రాలను కలపడం గురించి మీరు ఆలోచించనవసరం లేదు,” అని వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.

ఇక తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ, “ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను మళ్ళీ కలపాలంటూ వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు అర్దరహితం. వారు మీడియా దృష్టిలో పడటానికి లేదా కాలక్షేపానికి పనికివస్తాయి తప్ప వాటితో మరే ప్రయోజనం లేదు. అసలు తెలంగాణ ప్రజల మనోభీష్టానికి విరుద్దంగా ఆనాడు తెలంగాణని ఏపీలో కలిపినందునే దానిని వ్యతిరేకిస్తూ 60 ఏళ్లపాటు పోరాడి తెలంగాణ సాధించుకొంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏపీలో కలపాలనడం అవివేకమే.

తెలంగాణ అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో అందరి దృష్టి మా రాష్ట్రంపైనే ఉందని మాకు అర్దం అవుతూనే ఉంది. కానీ పొరాడి సాధించుకొని అభివృద్ధి చేసుకొంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితులలో సమైక్యవాదుల చేతిలో పడనీయము.

ఒకవేళ విడిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏపీలో కలపాలనుకొంటే ఏపీని కూడా తమిళనాడులో కలపాలని వారూ అడగవచ్చు. మరికాస్త వెనక్కి వెళితే భారత్‌ని ఇంగ్లాండ్ దేశంలో కలపాలని వారూ అడగవచ్చు కదా?ఏపీ వైసీపీ నేతలు తమ రాష్ట్రం గురించి, ప్రజల గురించి ఆలోచించకుండా తెలంగాణ రాష్ట్రంలో వేలుపెట్టాలని ఎందుకు అనుకొంటున్నారో అర్దం కాదు,” అని అన్నారు.

వైఎస్ షర్మిల, మంత్రి జగదీష్ రెడ్డి చెప్పినట్లు ఏపీ మంత్రులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించకుండా ఎప్పుడూ ఎన్నికలు, ఓట్లు, రాజకీయాలతోనే కాలక్షేపం చేసేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తమ ప్రభుత్వం అసమర్దతని, వైఫల్యాలని కప్పి పుచ్చుకొని వాటిపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే ఇటువంటి అసందర్భ మాటలు మాట్లాడుతుంటారు. ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించి వారి తెలివితేటలను, శక్తిసామర్ధ్యాలను తక్కువగా అంచనా వేసి ఈవిదంగా మభ్యపెట్టాలని ప్రయత్నించిన ఏ పార్టీ కూడా ఎక్కువ కాలం అధికారంలో నిలబడలేదని వైసీపీ నేతలు గ్రహిస్తే వారికే మంచిది.