YS sharmila paramarsa yatraవైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ప్రారంభమైన “ఓదార్పు యాత్ర” ఇప్పటికీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ చేసి చేసి అలసిపోగా, ప్రస్తుతం ఆ విధులను ‘జగన్ బాణం’ తెలంగాణాలో ‘పరామర్శ యాత్ర’ పేరుతో నెరవేరుస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో గాంధీ పోతంగల్ కలాన్ గ్రామంలో ముగిసిన ‘పరామర్శ యాత్ర’ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన షర్మిల పలు కీలక వ్యాఖ్యలు చేసారు.

“ఈ రోజు వరకు ప్రజాస్వామ్య చరిత్రలో ఓ నాయకుడు చనిపోతే, 750 మంది మృతి చెందిన సంఘటనలు లేవని, దీనిని బట్టి వైయస్ రాజశేఖర రెడ్డి ఎంతటి గొప్ప ప్రజానాయకుడో అర్థమవుతోందని, తండ్రీబిడ్డల అవసరాలు తీర్చినట్లుగా ప్రజల సంక్షేమం నిర్వహించిన గొప్ప ముఖ్యమంత్రి వైయస్ అని, కుల, మత, ప్రాంత, వర్గం బేధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశారని, 23 జిల్లాల అమలు చేసిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పధకాలతో… ప్రజల గుండెల్లో వైయస్ ఎప్పటికీ చిరంజీవిగా నిలిచి ఉంటారని” ప్రశంసలు కురిపించిన షర్మిల, పావురాలగుట్టలో జగన్ ఇచ్చిన మాట మేరకు పరామర్శ యాత్ర చేయడం సంతోషాన్ని కలిగించిందని ‘జగన్ బాణం’ వ్యాఖ్యానించారు.

వైయస్ పై షర్మిల చేసిన పొగడ్తలఅగడ్తల గురించి పక్కన పెడితే, ఒక నాయకుడిగా వైయస్ సమర్ధత రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. అలాగే అవినీతి అంశాలను విస్మరిస్తే, వైయస్ సంక్షేమ పధకాలు ప్రజాధరణ పొందినవే. కానీ, వైయస్ మరణించిన సందర్భంలో… ఆగిన ప్రజల గుండెల లెక్కలపై విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో సాధారణ మరణాలను కూడా వైయస్ అకౌంట్ లో వేసారని విస్తృతంగా జరిగిన ప్రచారం జరిగింది. అలా లెక్కించిన మొత్తం దాదాపు 500 నుండి 600గా నమోదు కాగా, తాజాగా షర్మిల 750 అని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. ఇలా పెంచుకుంటూ పోతే ఆ సంఖ్య “నాలుగు అంకెలకు” చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని, ఈ “ఓదార్పు, పరామర్శ యాత్ర”లకు అంతం ఉండదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

రాజకీయాల్లో అతిశయోక్తులు సాధారణమే గానీ, ‘అతిశయోక్తి’కే అతిశయోక్తులు చెప్పడం బహుశా జగన్ వర్గానికే చెల్లిందేమో… అంటూ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బహుశా అప్పటి నుండి ఇప్పటివరకు మరిణించిన వారిలో మరికొందరిని ఎంపిక చేసి వైయస్ అకౌంట్ లో వేస్తున్నారేమో అన్న విమర్శలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. లేక ఇటీవల గుంటూరు వేదికగా జగన్ చేసిన ‘నిరాహార దీక్ష’ను పోలీసులు భగ్నం చేసిన సమయంలో… ఆ దృశ్యాలను చూడలేక తెలంగాణాలో ఆగిపోయిన అభిమానుల గుండెలను కూడా షర్మిల పరామర్శిస్తున్నారేమో! అన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి.