YS-Sharmila-Paleruతెలంగాణ రాజకీయాలలో ప్రవేశించిన వైఎస్ షర్మిలని ఎవరు ఎవరిపై గురిపెట్టిన బాణం?అని ఓ పక్క చర్చ జరుగుతుండగానే వచ్చే ఎన్నికలలో ఆమె ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయం అని స్పష్టం చేస్తున్నారు. ఖమ్మం బైపాస్ రోడ్డులో కరుణగిరి చర్చి సమీపంలో ఓ స్థలం కొనుగోలు చేశారు. ఈరోజు అక్కడ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయం నిర్మించడానికి వైఎస్ షర్మిల శంఖుస్థాపన చేయనున్నారు.

ఇంతకాలం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నుంచే పార్టీని నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఖమ్మంలో పార్టీ కార్యాలయం కోసం సొంత భవనం నిర్మించుకొంటుండం ద్వారా తాను తెలంగాణలో ఆషామాషీగా రాజకీయాలు చేయడం లేదని, తమ పార్టీ కూడా మిగిలిన పార్టీలలాగే తెలంగాణలో అధికారం సాధించేందుకు కృతనిశ్చయంతో ఉందని చాటి చెప్పినట్లవుతుంది.

అయితే తెలంగాణలో బిఆర్ఎస్‌ ధాటికి తట్టుకోలేక జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అల్లాడుతుంటే, మరో జాతీయపార్టీ బిజెపి వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌ని ఓడించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలలో భాగంగానే ఐ‌టి, ఈడీ, సీబీఐ దాడులు కూడా అని బిఆర్ఎస్‌ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జాతీయ పార్టీలైన వామపక్షాలని, తెలంగాణ ఉద్యోమాలలో పాల్గొన్న ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ జన సమితిని కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు.

ఈ నేపద్యంలో ఆంద్రా మూలాలు ఉన్న వైఎస్ షర్మిల తనని తెలంగాణ ప్రజలు అదరించి రాష్ట్రంలో అధికారం కట్టబెడతారని నమ్ముతున్నారని భావించలేము. అయితే ఓ రాజకీయ పార్టీ సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా ఓట్లు చీల్చి నష్టపరచగలిగే స్థాయికి ఎదిగితే చాలు దానిని అన్ని ప్రధానపార్టీలు, మీడియా కూడా తప్పక గుర్తిస్తాయి. ఇందుకు ఉదాహరణగా ఏపీలో జనసేనని చెప్పుకోవచ్చు. సిఎం జగన్‌ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ నిత్యం పవన్‌ కళ్యాణ్‌ భజనలో తరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

కనుక వైఎస్ షర్మిల కూడా తెలంగాణలో కనీసం ఆ స్థాయికి చేరుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఆమె ఏవిదంగా తనకి అనుకూలంగా మలుచుకొని జాతీయవార్తలకి ఎక్కరో అందరూ చూశారు. వైఎస్ షర్మిల సొంతంగా తెలంగాణలో అధికారంలోకి రాలేనప్పటికీ టిఆర్ఎస్‌ లేదా బిజెపికి పరోక్షంగా మేలు చేస్తూ పనిలో పనిగా తాను రాజకీయంగా బలపడే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చు.