YS Sharmila Telanganaకృష్ణా జిల్లాలో తన పాదయాత్ర సందర్భంగా 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతా అని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఆ ఊసు లేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుండీ ఎన్టీఆర్ అంటే టీడీపీ మనిషి అన్నట్టే జగన్ దూరాంగా ఉంటూ వచ్చారు.

అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ…. జగన్ సోదరి షర్మిల ట్విట్టర్ లో ఎన్టీఆర్ కు అంజలి ఘటించారు. “పటేల్..పట్వారి వ్యవస్థలను రద్దు చేసి.. బిసి లకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు..మహిళలకు ఆస్థి హక్కు కల్పించి..రెండు రూపాయలకే కిలో బియ్యంతో పేదవాడి ఆకలిని తీర్చిన..నందమూరి తారక రామారావు గారిని.. వారి జన్మదినం సందర్భగా..వారి సంక్షేమాన్ని గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది,” అంటూ ట్వీట్ చేశారు.

పైగా జగన్ అంటే గిట్టని ఆంధ్రజ్యోతి పత్రికలోని ఒక వ్యాసాన్ని జతపరిచి ట్వీట్ చేశారు షర్మిల. అయితే దీని వెనుక వ్యూహం ఏమిటయ్యి ఉంటుందని అంతటా చర్చ జరుగుతుంది. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని పోయే ప్రయత్నం అని కొందరు అంటుంటే… రాజకీయాలలో తన వ్యూహం, తన అన్న వ్యూహాలు ఒకటి కానక్కరలేదు అని ఆమె ఇండైరెక్టుగా చెబుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అన్నతో విభేదించి తెలంగాణ రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన షర్మిల జులై 8న తన పార్టీ పేరుని ప్రకటించబోతున్నారు. ఆ తరువాత తెలంగాణలో ఒక పాదయాత్రకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.